పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు , మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,

పత్రిక ప్రకటన

తేదీ : 26–05–2022

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు ,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులందరిపైనా ఉందని… దీనిని ఒక సవాలుగా తీసుకొని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలపై సంబంధిత శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు తమ విధులు నిర్వహించాలని సూచించారు. ఈ పనులను ఒక సవాలుగా తీసుకొని చేయాలని గతంలో కరోనా వల్ల కొంత ఇబ్బంది కలిగిందని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు సంబంధించి అధికారులు చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని వాటిని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలపై ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని… అందులో ప్రజాప్రతినిధులను కలుపుకొని పనులు చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా వైకుంఠధామం చుట్టూ రెండు వరుసలలో బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని,  నీటి సౌకర్యం ఉండేలా  చూడాలని, లేని పక్షంలో తక్షణమే ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులను సంప్రదించి  ఏర్పాటు చేయాలని అన్నారు.   ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలకు సంబంధించి జిల్లా నుంచి మూడు ఉత్తమ (బెస్ట్) పంచాయతీలు, మూడు వరస్ట్ పంచాయతీలను గుర్తించడం జరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు తమ విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వివరించారు. అలాగే జిల్లాలోని మున్సిపాలిటీల్లో  గ్రీన్ బడ్జెట్ వాడుకోవాలని తెలిపారు. హరితహారంలో మల్టీలేయర్ ప్లాంటేషన్ చేపట్టాలని ఈ విషయంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొందని పేర్కొన్నారు. అలాగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి సీనియర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసేందుకు వస్తారని దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులందరూ బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పని చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా వారికి స్థానచలనం కూడా తప్పదని ఈ విషయాలను గుర్తించి ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తమ విధులు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల డంపింగ్ యార్డులు పూర్తి చేయాలని అలాగే మండలాల వారీగా క్రీడా ప్రాంగణాల పనులు ప్రారంభించి జూన్ 2,వ తేదీన ఆయా చోట్ల సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేయాలని  కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. దీంతో పాటు గ్రామగ్రామాన ఆ గ్రామానికి సంబంధించిన పేర్లను గ్రామంలోకి  ప్రవేశించేప్పుడు గ్రామ పరిధి దాటి వెళ్ళేప్పుడు బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. జిల్లాలోని ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు కింది స్థాయి అధికారులు ప్రణళికలు రూపొందించుకొని కలిసి పని చేయాలని తెలిపినారు. మున్సిపాలిటీలలో ఆయా దుకాణాల వద్ద తప్పకుండా దుకాణదారులతో మొక్కలను నాటించి వాటిని సంరక్షించే చర్యలు కూడా వారికి అప్పగించాలని ఈ విషయంలో పూర్తి బాధ్యత సంబంధిత మున్సిపల్ కమిషనర్లదేనని అన్నారు. అనంతరం ఆయా మండలాల మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను పలు వివరాలను అడిగి తెలుకొన్నారు.  ప్రజలు, ప్రజాప్రతినిధులతో మమేకమై సమన్వయంతో కలిసి పని చేస్తే ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయని దీనిని దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలను నిర్వహించి విజయవంతమయ్యేలా చూడాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీఆర్డీఏ పీడీ పద్మజారాణి, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, జిల్లా అటవీ శాఖ అధికారి అశోక్కుమార్, ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు,   సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Share This Post