పల్లె ప్రగతి , పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు , పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్


పల్లె ప్రగతి , పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు , పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అన్నారు.
తెలంగాణ ఏర్పాటు ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల సహకారంతో 19,472 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్పూర్తితో మండలానికి 4 చొప్పున ఇప్పటి వరకు 547 మండలాలలో బృహత్ పల్లె ప్రకృతి వనంలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని అన్నారు.
గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలంలోని చేగూర్ గ్రామంలో ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనంను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొక్కలను నాటి ప్రారంభించారు.
ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ ప్రతి రోజు మేము సమావేశాలకే పరిమితమవుతామని, ఈ రోజు మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాల సంతోషంగా ఉందని అన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటుచేయడం చాల బాగుందని ప్రశంసించారు, గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి , పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు , పట్టణాలు ఏంతో అభివృద్ధి చెంది పరిశుభ్రముగా, పచ్చదనంగా కనిపిస్తున్నాయని, ప్రతి గ్రామపంచాయతీలో ఒక్క ట్రాక్టర్ , ట్యాంకర్ , ట్రాలీ ఉన్నాయని చెప్పారు. గ్రామాలలో వైకుంఠ ధామాలు , డంపింగ్ యార్డులు,నర్సరీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామాలు సుందరంగా కనిపిస్తున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్మించుకున్నామని , అదే విధంగా ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన విధంగానే పట్టణాలలో పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు వాకింగ్ చేయుటకు వాకింగ్ ట్రాక్ లను , కూర్చోవడానికి బెంచీలను , పిల్లలు ఆడుకునే విధంగా అన్ని వసతులను కల్పించడం వలన ప్రజలు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతున్నారని తెలిపారు.
స్పెషల్ సీ.ఎస్ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన విధంగానే పట్టణాలలో కూడా పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే 145 మున్సిపాలిటీలలో పార్కులు , నర్సరీలు ఉన్నాయని, 3400 వార్డులలో పార్కులు ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ లను , కూర్చోవడానికి బెంచీలను , పిల్లలు ఆడుకునేలా సౌకర్యాలను కల్పించడం జరిగిందని , మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలకు , మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులలో 10 శాతం గ్రీనరీ కోసం ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా , వ్యవసాయ శాఖ కమీషనర్ రఘునందనరావు , ఫైనాన్స్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ , అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ , ట్రైనీ కలెక్టర్ కదిరవన్ , అటవీ శాఖ కమీషనర్ ప్రసాద్ , గ్రామ సర్పంచ్ మామిళ్ళ సంతోష విఠల్ , ఎం. పీ పీ ప్రియాంక , షాద్ నగర్ ఆర్డీఓ రాజేశ్వరి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post