పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పునః ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తీ చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 28, 2021ఆదిలాబాదు:-

పండుగ వాతావరణంలో పాఠశాలలు, అంగన్వాడీలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలక్ మందిర్ లో శానిటేషన్ కార్యక్రమాలు, పునః ప్రారంభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. తొలుత పాఠశాల తరగతి గదులను, మరుగుదొడ్లను, త్రాగునీటి కుళాయిలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర విద్య శాఖ మంత్రి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, విద్య శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పునః ప్రారంభించాలని ఆదేశించారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోని 1458 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ శాఖల సొసైటీ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, కళాశాలలు, 1256 అంగన్వాడీ కేంద్రాలు, మినీ అంగన్వాడీ కేంద్రాలను సెప్టెంబర్ ఒకటి నుండి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచాలని, దోమల నివారణకు రసాయనాలను స్ప్రే చేయించాలని, నీటి నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని, రన్నింగ్ వాటర్ సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలనీ, మిషన్ భగీరథ నీటి సరఫరాకు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సంప్రదించి ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను ఆయా మండల అధికారులు, సెక్టోరల్ అధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లను ఈ నెల 30 లోగా పూర్తీ చేసి సంబంధిత ప్రదోనోపాధ్యాయులు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని అన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి విద్యార్థి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం వంటివి పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post