పాఠశాలల్లో కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 22: పాఠశాలల్లో కోవిడ్ నియంత్రణకు నియమ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టర్ లింగాలఘనపూర్ మండల చీటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసారు. ఉపాధ్యాయుల హాజరు పుస్తకం తనిఖీ చేసి, ఎంతమంది హాజరయినది పరిశీలించారు. గదులు సానిటైజ్ చేస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థి ప్రవేశించు సమయంలో థర్మల్ స్కానర్ తో పరిశీలించి అనుమతించాలని, లక్షణాలుంటే వెంటనే పరీక్షకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను తరగతుల విషయమై అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్కులు ఖచ్చితంగా ధరించాలని అన్నారు. పరిశుభ్రత పాటించాలని ఆయన తెలిపారు. మధ్యాహ భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, శుద్దమైన త్రాగునీరు ఇవ్వాలని ఆయన అన్నారు. మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాల అందరికి ఒకే సమయంలో కాక, విడతలుగా భోజనం అందించాలని తెలిపారు. ఉపాధ్యాయులు పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని, బోధించింది పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకున్నది చూడాలని అన్నారు. డిజిటల్, ఆడియో విజువల్ తరగతుల ద్వారా పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారన్నారు. పాఠశాలలో 41 మంది పదో తరగతి విద్యార్థులు వున్నట్లు, వంద శాతం ఉత్తీర్ణతకై ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. పాఠశాల ఆవరణలో ఖాళీ స్థలం వున్నట్లు, అట్టి స్థలంలో మొక్కలు నాటాలన్నారు. మునగ, కరివేపాకు, నిమ్మ, పండ్ల మొక్కలు నాటాలని ఆయన అన్నారు. మొక్కలతో చుట్టూతా గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా పంచాయితి అధికారి రంగాచారి, పాటశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు వున్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post