పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు:: జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి

*పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు:: జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి

జనగామ, ఆగస్టు 28: జిల్లాలోని పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్ లో 1వ స్థాయి నుండి 7వ స్థాయి సంఘ సమావేశాలను చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఇట్టి సమావేశంలో విద్య, విద్యుత్, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, పౌరసరఫరాలు, భూగర్భజల శాఖ, పరిశ్రమలు, ఉపాధికల్పన, గ్రామీణ త్రాగునీరు, పంచాయితీరాజ్, సహకారం, వైద్యం, క్రీడలు, చేనేత జౌళీ, ఎక్సైజ్ శాఖలచే చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ, విద్యాసంస్థల మరమ్మత్తులు, మౌళిక సదుపాయాల కల్పనకు జెడ్పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సిల నిధులతో చేపట్టాలన్నారు. సెప్టెంబర్ 1 న విద్యాసంస్థల పునఃప్రారంభం దృష్ట్యా పిల్లల బాగోగులు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, పిల్లలందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. మండల విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని గ్రామాల్లోని పాఠశాలలు తనిఖీలు చేసి, ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయాలని, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి ఉపాధికల్పన పధకంపై విస్తృత ప్రచారం కల్పించి, జిల్లానుండి ఎక్కువ మంది లబ్ది పొందేలా చూడాలన్నారు. భూగర్భజలాల పెంపుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు నష్టపోకుండా పౌరసరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న పధకాలు అర్హులందరికీ అందేలా అవగాహన కల్పించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాద్వారా సురక్షిత త్రాగునీటితో పాటు ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వంచే చేపడుతున్న రైతు వేదికలు, వైకుంఠదామాలు తదితర అన్ని అభివృద్ధి పనులకు నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాoకర్ లు ఏర్పాటుచేసుకున్నట్లు, వాటిని వినియోగిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా చేయాలని, ప్రతిరోజు చెత్తను డంపింగ్ యార్డ్ లకు తరలించాలని ఆయన అన్నారు. హరితహారం క్రింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా వుండి, కోవిడ్ నియంత్రణపై అవగాహన తోపాటు జాగ్రత్తలపై గ్రామీణ ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. కనీస మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించి, పెండింగ్ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జిల్లా ప్రజాపరిషత్ ద్వారా అందిన నిధులు, వాటి వినియోగం, గ్రామాల్లో చేపట్టిన పనులపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, కోవిడ్ విపత్కర సమయంలోను గ్రామాలకు ప్రతి నెల నిధులను సకాలంలో విడుదల చేస్తుందని, నిధులని సమర్థవంతంగా వినియోగించుకొని గ్రామాలను అభివృద్ధి పర్చాలన్నారు.
ఈ సమావేశంలో జెడ్పి సిఇవో ఎల్. విజయలక్ష్మి, జెడ్పి వైస్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, జిల్లా స్టాండింగ్ కమిటి చైర్మన్ మారపాక రవి, జిల్లా జడ్పిటిసిల ఫోరం అధ్యక్షులు బొల్లం మణికంఠ, జడ్పిటిసిలు దీపిక రెడ్డి, గుడి వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్, ఇల్లందుల బేబి, ముద్దసాని పద్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది

Share This Post