పాఠశాలల పునః ప్రారంభానికి పూర్తి ఏర్పాట్లు చేపట్టండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 28, 2021ఆదిలాబాదు:-

సెప్టెంబర్ ఒకటి నుండి విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభం అవుతున్న దృష్ట్యా వాటిని శుభ్రం చేయించడం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయం నుండి ఎంపీడీఓ లు, జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాలలకు తిరిగి రానున్న సందర్భంలో పండుగ వాతావరణంలో పాఠశాలలను పునః ప్రారంభించాలని అందుకు తగిన ఏర్పాట్లు పాఠశాల అధ్యాపకులు, మండల, జిల్లా అధికారులు సమన్వయ సహకారం తో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పూర్తి ఏర్పాట్లు నిర్వహించాలని అన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు తరగతి గదులకు హాజరు అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. పాఠశాలల్లోని తరగతి గదులు, బెంచ్ లు, మరుగుదొడ్లు, పరిసరాలను స్థానిక మల్టి పర్పస్ వర్కర్లతో శుభ్రం చేయించాలని, అవసరమైన పక్షంలో ఆయా సర్పంచ్ లతో మాట్లాడి ఎక్కువ మంది కార్మికులతో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఆగష్టు 30 నాటికీ పూర్తి ఏర్పాట్లు అయినట్లు ఎంపీడీఓ లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, పాఠశాలలు, అంగన్వాడీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం, చెత్తను తొలగించడం పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అవసరమైన లేబర్ ను సమకూర్చుకొని పనులు నిర్వహించాలని అన్నారు. గ్రామపంచాయితీ నిధులను వినియోగించుకోవచ్చని సూచించారు. మరుగుదొడ్లు, తరగతి గదులు, వంట గదులను శుభ్రం చేయించాలని, సోడియం హైపో క్లోరైడ్ ను పిచికారీ చేయించాలని, మిషన్ భగీరథ పైపు లైన్ ద్వారా నీరు సరఫరా అయ్యే విధంగా గ్రామీణ నీటి సరఫరా అధికారులు కొత్త కనెక్షన్ లు ఇవ్వడం తో పాటు, పాత  కనెక్షన్లు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అని పరిశీలించి, పని చేయని పైపు లైన్ ను మరమ్మతులు చేయించాలని అన్నారు. విద్యార్థులు తమ స్వంత పిల్లల్లాగా భావించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా మల్టి లేయర్ క్రమం లో మొక్కలను నాటడం, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో గుంతలు తవ్వి మొక్కలు నాటాలని అన్నారు. వచ్చే సెప్టెంబర్ ఒకటి నుండి అటవీ శాఖ సిబ్బంది మల్టి లేయర్ ప్లాంటేషన్ లను పరిశీలించిన దృష్ట్యా గ్రామాలలో నాటిన మల్టి లేయర్ ప్లాంటేషన్ లలో మొక్కలు సరిగా ఉన్నాయో లేదో అని పరిశీలించుకుని సరి చేసుకోవాలని ఎంపీడీఓ లకు సూచించారు. సీనియర్ అధికారులు పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాలలో చేపడుతున్న శానిటేషన్ పనులను పరిశీలించి లోటుపాట్లను గుర్తించి సరిచేయించాలని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్య శాఖ అధికారి రవీందర్ రెడ్డి, RWS ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post