*పాఠశాలల పునః ప్రారంభం నాటికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి*
*అంచనాలు సిద్ధం చేసి, వారం రోజుల్లోగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూడాలి*
*జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు*
————————————-
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో మన ఊరు-మన బడి కార్యక్రమంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9,123 పాఠశాలలను ఆధునీకరించి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. వాటన్నింటికి త్వరగా అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలన్నారు. 30 లక్షల అంచనా వరకు ఉన్న వాటిని వెంటనే పనులు ప్రారంభించాలని, అంతకుమించి అంచనాలు ఉంటే వారం లోపల టెండర్లు పిలిచి పనులు అప్పగించాలన్నారు. ఈ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు స్వయంగా పర్యవేక్షించి పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. ఫర్నిచర్ ఇతర సదుపాయాల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నమూనాతో తయారు చేయించి పంపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఇంటర్, పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నిధులకు ఎలాంటి కొరత లేదని పని అయ్యేకొద్ది నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు అడ్వాన్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. అవసరమైన మేరకు మాత్రమే మరమ్మతులు, నిర్మాణం చేయించాలన్నారు. అవసరమైన చోట అద్దే భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పాఠశాల భవనాలకు మార్చాలని సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, డీఈఓ డా. రాధాకిషన్, డీఎంహెచ్ఓ డా.సుమన్ మోహన్ రావు, విద్య, వైద్యారోగ్య శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————