పాఠశాలల పున ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలను ప్రారంభించడం నిర్ణయం తీసుకున్నామని అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సర కాలం నుండి విద్యా వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని, విద్యాసంస్థలు మూసివేయడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు ప్రారంభం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికనుగుణంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 29 వరకు జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. పాఠశాలలో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయాలని తెలిపారు. పాఠశాలల నిర్వహణకు ప్రత్యేకంగా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, దీనిలో పంచాయతీ సెక్రెటరీ, విఏఓ, ఏఎన్ఎం, అంగన్వాడి, ఆశ కార్యకర్తలను సభ్యులుగా ఉంచాలన్నారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ నీరు అందించాలన్నారు. పాఠశాలలో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించాలని కొత్త స్టాక్ అవసరమైతే ఆర్డర్ చేయాలన్నారు. వీటన్నిటిని ఈ నెల 29 లోపు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో సిబ్బంది స్థానికంగా ఉండాలని లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ఏవైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తితే వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పరీక్షలు చేసి చికిత్స నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ సెంటర్లకు అవసరమైతే రంగులు వేయాలని తెలిపారు. విద్యా సంస్థల నిర్వహణలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు దూరంగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు కలిగే అసౌకర్యం లకు ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల నిర్వహణలో సర్పంచులను కూడా కలుపుకుని ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరీక్షల సహాయ సంచాలకులు ఉదయ బాబు, పంచాయతీ రాజ్ శాఖ ఈ ఈ రామ్మోహనరావు తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది

Share This Post