పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ : జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి

-జిల్లాలో 126 అంగన్వాడీ ఖాళీ పోస్టుల భర్తీ కి చర్యలు

-రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఇచ్చే మెరిట్ ఆధారంగా నే ఎంపిక

-మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రభుత్వ మార్గదర్శకాలు,నియమ నిబంధనలకు అనుగుణంగా
జిల్లాలో ఖాళీగా అంగన్‌వాడీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలో కమిషనర్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
దరఖాస్తుదారుల మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దనీ జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి అన్నారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సిద్దిపేట జిల్లాలో 1150 అంగన్వాడీ సెంటర్లలోని (22) మెయిన్ అంగన్వాడి టీచర్లు, (9)మినీ అంగన్వాడీ టీచర్లు మరియు (95) అంగన్వాడీ ఆయాల ఖాళీలు మొత్తం 126 ఖాళీల భర్తీకి గత నెల ఆగస్టు 24న ప్రకటన వెలువరించగా ఈ నెల 8వ తేదీ వరకు మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన వెబ్ సైట్ నందు దరఖాస్తులు స్వీకరించారనీ తెలిపారు.

కాగా, 22 మెయిన్ అంగన్వాడి టీచర్ల ఖాళీలకు గాను 1842 దరఖాస్తులు, 9 మినీ అంగన్వాడీ టీచర్ ఖాళీ లకు గాను124 దరఖాస్తులు మరియు 95 ఆయా పోస్టులకుగాను 682 దరఖాస్తులు మొత్తంగా నోటిఫికేషన్ నందు వేలువరించిన 126 ఖాళీలకు గాను 2648 దరఖాస్తులు ఆన్లైన్ లో వచ్చాయన్నారు.

ఇట్టి పోస్టులకు గాను అభ్యర్థులు కచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణులై స్థానికంగా అంటే గ్రామీణ ప్రాంతంలోని వారు అదే గ్రామపంచాయతీ పరిధిలో మరియు పట్టణ పరిధిలోని వారు అదే స్థానిక వార్డులో నివసించేవారు మాత్రమే అర్హులనీ తెలిపారు.

వయస్సు జూలై 1, 2021 నాటికి 21 నుండి 35 ఏళ్లు మించకుండా ఉండాలన్నారు. ముఖ్యంగా నోటిఫికేషన్లో ప్రకటించబడిన సంబంధిత కుల రిజర్వేషన్ కు చెందిన మహిళ లు మాత్రమే అర్హులన్నారు.

కాగా ఇట్టి పోస్టులకు పదవ తరగతి మెరిట్ నకు 80 మార్కులు, అనాధ మహిళకు 10 మార్కులు, వితంతు మహిళకు 5 మార్కులు మరియు దివ్యాంగ మహిళకు 5 మార్కులు మొత్తంగా 100 మార్కులకు గాను వెబ్ సైట్ నందు వారు నమోదు చేసిన వివరాల ప్రకారం మెరిట్ లెక్కింపబడుతుందన్నారు.

రాష్ట్రస్థాయిలో కమిషనర్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడు వెబ్ సైట్ నందు ఏవైతే అభ్యర్థులు తమ వివరాలను వెబ్ సైట్ నందు నమోదు చేసుకొని తగిన ధ్రువీకరణ పత్రములను అప్లోడ్ చేసినారో, సంబంధిత వెబ్ సైట్ లో మార్కులు లెక్కింప బడి మెరిట్ నమోదు చేయబడుతుందన్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్ సైట్ నుండి జనరేట్ చేయబడిన మెరిట్ లిస్టు మాత్రమే జిల్లా కలెక్టర్ నకు వచ్చిన తర్వాత…
అట్టి మెరిట్లో ఉన్న దరఖాస్తుదారు యొక్క ఒరిజినల్ ధ్రువీకరణ పత్రముల యొక్క వాస్తవికతలను మాత్రమే పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.

ధృవీకరణ పత్రాల లోని వివరాలు వాస్తవం అని రూఢీ చేసుకున్న తరువాత నిర్దేశిత పోస్టుల కు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

జిల్లాలో కలెక్టర్ కు గాని మరే ఇతర అధికారులకు గాని అభ్యర్థి మెరిట్ లో రావడానికి, మెరిట్ లో లేని అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి విషయంలో ఏలాంటి సంబంధం ఉండదని జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వెబ్సైట్లో నమోదు చేయబడిన వివరాల ఆధారంగా వచ్చేటువంటి మెరిట్ ప్రకారం మాత్రమే అభ్యర్థులు ఎంపిక చేయబడతారనీ జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ విషయంలో అభ్యర్థులు ఎలాంటి దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి దరఖాస్తు దారుల కు విజ్ఞప్తి చేశారు.

Share This Post