పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ:-రంగారెడ్డి జిల్లా

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రెండవ కెనాల్ ఏర్పాటు పై పర్యావరణ అనుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతముగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. మంగళవారం తలకొండపల్లి మండలం దేవుని పడకల్ ఎక్స్ రోడ్డు లోని శ్రీ వేంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి తలకొండ పల్లి, మాడుగుల, కడ్తాల్ , అమన్ గల్ నాలుగు మండలాల నుండి రైతులు వచ్చి ప్రాజెక్ట్ ఏర్పాటు విషయంలో పర్యావరణానికి సంబంధించిన తమ అభిప్రాయాలను తెలియజేసారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాజెక్ట్ కింద 20 మండలాల్లో 330 గ్రామాల్లో 3,59,047 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ప్రాజెక్ట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత భూగర్భ జలాలు పెరగటం అదనంగా నీటి సామర్థ్యం ఆయకట్టు ప్రాంతంలోని రైతుల జీవన ప్రమాణాల్లో మెరుగుదల ప్రాజెక్టు పనులు , మత్స్య సంపద ద్వారా ఉద్యోగ అవకాశాలు పశువుల పెంపకం, వినోదం, పర్యాటకం, ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలు మెరుగైన రీతిలో అందుబాటులో ఉంటాయని అన్నారు. ఆయకట్టు కాలువల నిర్మాణానికి సంబందించి పర్యావరణ అనుమతి అవసరం ఉందని అందుచేత పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణలో ప్రజలు అభిప్రాయాలు తెలుపాలని అన్నారు.
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ లో 30 మంది ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఎన్. జి.ఓ.లు తమ అభిప్రాయాలు తెలిపారు. వారు ప్రాజెక్ట్ లో భాగంగా కాలువలు నిర్మాణం వలన ఈ ప్రాంతం కు మంచి జరుగుతుందని, ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం వలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందించాలని, మార్కెట్ విలువ ప్రకారం అందించాలని,తొందరగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని అభిప్రాయం తెలిపారు. రైతులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు వెలువరించిన వారి అభిప్రాయాలు వీడియో రికార్డింగ్ చేయించడం జరిగిందని, వీటిని కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు.
అంతకన్నా ముందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు, పర్యావరణ ఇంజినీరు వెంకన్న ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ ఫేజ్ కెనాల్ ఏర్పాటు ఆవశ్యకత, అందుకు అయ్యే ఖర్చు, ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా లాభాలు, ప్రాజెక్ట్ ఏర్పాటు వాళ్ళ ఏర్పడే పర్యావరణ నష్టం తదితర అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు. యల్.ఇ.డి. ప్రొజెక్టర్ పై తెలుగులో, ఆంగ్లంలో పూర్తి వివరాలు గణాంకాలతో సహా వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ ఎస్. ఈ సత్యనారాయణ , ఆర్డీవో వెంకటచారి, అధికారులు, రైతులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు హాజరయ్యారు.

Share This Post