పాల్వంచ మున్సిపాల్టీని ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.

మంగళవారం పాల్వంచ పట్టణంలో ఇంటింటి వ్యర్థాలు సేకరణకు చేపట్టిన చెత్తబుట్టలు పంపిణీ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే అంశంపై మున్సిపల్ అధికారులు వ్యాపారులకు, మహిళా సంఘాలతో శాస్త్రిరోడ్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 75 మైక్రాన్స్ కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు నిషేదించినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయించినా, వినియోగించినా 5 వేల నుండి 25 వేల వరకు జరిమాన విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు మన వంతు కృషి చేసినవారమవుతామని, ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలని చెప్పారు. ప్లాస్టిక్ వల్ల మానవాళి ప్రమాదంలో పడిపోతున్నదని, ప్రజలు ఇంటి నుండి మార్కెట్కు వెళ్తున్నపుడే నార, గుడ్డతో చేసిన సంచులను, మాంసం కొనుగోలుకు క్యారేజిలను వెంట తీసుకెళ్లాలని చెప్పారు. కూరగాయలు, మాంసపు, వ్యాపార దుకాణాలను మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు వినియోగించకుండా నార, గుడ్డతో చేసిన సంచులు, మాంసం కొరకు క్యారేజిలు తెచ్చిన వ్యక్తులకే విక్రయించు విధంగా అవగాహన కొరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వ్యాపారులు తడి, పొడి చెత్తబుట్టలు వినియోగించాలని, వ్యర్థాలను ఆరుబయట పడేయకుండా బాధ్యతగా మున్సిపల్ సిబ్బందికి అందచేయాలని చెప్పారు. తడి, పొడి చెత్త నిర్వహణను పాటిస్తున్న వ్యాపారులను, ప్రజలను జిల్లా కలెక్టర్ అభినందించారు. వ్యర్థాల నిర్వహణ ప్రక్రియను పాటిస్తూ స్వచ్చ మున్సిపాల్టీకి సహకరిస్తున్న వివిధ వ్యాపార వర్గాలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందచేశారు. అలాగే వ్యర్థాల సేకరణకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణలో తడి పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ కవర్లు వినియోగించమనే అంశాలపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి వ్యర్థాలు స్వచ్ఛ వాహన డ్రైవర్లును, సిబ్బందిని అభినందించి వారితో ఫోటోలు దిగారు. వాహనాలు వినియోగంపై లాగ్ బుక్ నిర్వహించాలని చెప్పారు. వర్తకులు, గేటెడ్ కమ్యూనిటీలలో నివసిస్తున్న ప్రజలు వర్మి తయారు చేయుటపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమీకృత మార్కెట్ నిర్మాణం, వైకుంఠ దామ నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని చెప్పారు. పాల్వం పట్టణంలో గ్రంథాలయ ఏర్పాటుకు భవన నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. రహదారులపై అక్కడక్కడ వ్యర్థాలు కనిపిస్తున్నాయని, తక్షణమే ఇరువైపులా పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగించి పరిశుభ్రం చేయించాలని చెప్పారు. డివైడర్లు నిర్మాణం పూర్తయినందున ఆహ్లాదంగా ఉండేందుకు మల్టీ పర్పస్ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బృహత్ పల్లె పకృతి వనంలో ప్రజలు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటుతో పాటు నీడనిచ్చే చెట్లు క్రింద ప్రజలుయోగా, మెడిటేషన్ చేయుటకు వీలుగా మంచిగా గడ్డితో లాస్ ఏర్పాటు చేయాలని సూచించారు. భువన్ సర్వే ప్రక్రియ, పన్నులు వసూళ్లు వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకుని తగు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసిల్దార్ స్వామి, మున్సిపల్ డిఈ మురళి, సానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post