పిడుగుపాటు – తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్ విడుదల : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాష

పత్రికా ప్రకటన
తేది:1.8.2022, వనపర్తి.

జిల్లాలో పిడుగులు పడే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షితంగా ఉండేందుకు తగు జాగ్రతలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాష సూచించారు.
సోమవారం ప్రజావాణి సమావేశ మందిరంలో “పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు” పై ఆమె మాట్లాడుతూ టీవి, రేడియోల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకొని, స్థానిక హెచ్చరికలు పాటించాలని ఆమె సూచించారు. ఆకాశంలో నల్లని మబ్బులు గుమిగూడడం, మెరుపులు కనిపించడం, ఉరుములు వినిపించడం, వేగంగా గాలులు వీచడం వంటివి పిడుగులు పడుటకు సంకేతాలని ఆమె తెలిపారు. ఎత్తైన ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ ఫోన్ టవర్లు, విద్యుత్తు స్తంభాలు, విడి విడిగా ఉండే చెట్లు, గృహాలు, బహిరంగ ప్రదేశాలలో పిడుగులు పడే అవకాశం ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో తగు జాగ్రతలు తీసుకోవాలని ఆమె అన్నారు. టీవి, రేడియోల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకొని స్థానిక హెచ్చరికలు పాటించాలని, తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, విద్యుత్ నిలిపి వేయాలని, లోహపు వస్తువులకు, వ్యవసాయ పంపుసెట్లకు దూరంగా ఉండాలని, తప్పని సరి పరిస్థితులలో బహిరంగ ప్రదేశాలలో ఉండవలసి వస్తే రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా, గోడలకు, ద్వారాలకు, కిటికీలకు, ఎండిన చెట్లు, విరిగిన కొమ్మలకు దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. పశుసంపదను సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని, భాధితులకు ప్రధమ చికిత్స అందించాలని, వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలని ఆమె సూచించారు. పిడుగులు పడే సమయంలో ఆరు బయట ప్రదేశాలలో, రేకుల షెడ్ల క్రింద, వరండాలో ఉండకూడదని, ఆశ్రయం కోసం చెట్ల క్రిందకి వెళ్ళకూడదని, నీటిలో ఉండకూడదని, లోహపు పైపుల నుండి వచ్చు నీటిని తాకకూడదని, సెల్ ఫోన్ లు ఉపయోగించరాదని, ఉరుములు, మెరుపులు
సంభవించిన తదుపరి 30 నిమిషాలు వరకు బయటకు వెళ్ళకూడదని, ట్రాక్టర్లు, మోటర్ సైకిళ్ళు ఆరు బయట నిలిపి ఉంచకూడదని ఆమె వివరించారు.
ఈ సందర్భంగా “పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు” పోస్టర్ ను ఆమె విడుదల చేశారు.
ఈ కార్యక్రమములో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ శంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్,  సీ.పి. ఓ. వెంకటరమణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post