పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకునే విధి విధానాల పట్ల జిల్లాలో విస్తృత అవగాహన ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు, 18,ఖమ్మం:

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకునే విధి విధానాల పట్ల జిల్లాలో విస్తృత అవగాహన ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో దత్తత ప్రక్రియ అవగాహన ప్రచార కార్యక్రమాల పట్ల అధికారులకు దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంతానం లేని దంపతులు, పిల్లలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చేవారికోసం చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే విధి విధానాలు, నియమ నిబంధనలను తెలిపే ప్రచార పోస్టర్లను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు, అన్ని ప్రయివేటు ప్రసూతి ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రదర్శింప చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులు సమన్వయంతో ఐదు సంవత్సరములకు పైబడి పిల్లలు లేని దంపతులను గుర్తించి, దత్తత పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమాజంలో ఆర్థిక, సామాజిక పరిస్థితులచే దత్తతకు ముందుకు రాని వారుంటారని అటువంటి వారికి, సమగ్ర అవగాహన కల్పించాలని దీనికి గాను, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రయివేటు ఆసుపత్రులు ప్రసూతి వైద్య నిపుణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దత్తత ప్రక్రియను వివరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. పేదరికం వలన పిల్లలను పోషించలేని తల్లి దండ్రులు, అవాంఛిత గర్భందాల్చడం ద్వారా పుట్టిన పిల్లలను పెంచడానికి ఇష్టపడని వారు గ్రామ అధికారుల ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అధికారుల దృష్టికి తెచ్చి పిల్లలను చట్టబద్ధంగా అప్పగించవచ్చని, అట్టి వివరాలు గోప్యంగా ఉంటాయని, అట్టి పిల్లలను సంతానం లేని దంపతులకు దత్తత ఇవ్వడం జరుగుతుందనే విషయం పట్ల జిల్లా. వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా సంక్షేమ శాఖాధికారి సంధ్యారాణి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥ వెంకటేశ్వర్లు, బాలల హక్కుల సంరక్షణ జిల్లా అధికారి విష్ణు వందన, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా॥ రాజేష్, డా॥సైదులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post