పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం ను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం ను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాధలైన చిన్నారులను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద సంగారెడ్డి జిల్లాలో అర్హులైన 9 మంది బాధిత బాలలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆర్ధిక ప్రయోజనానికి సంబంధించిన బాండ్ లను కలెక్టరేట్ లోని ఎన్ ఐ సి కార్యాలయంలో అందజేశారు.

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉపకార వేతనాలు, పీ ఎం కేర్స్ పాస్ బుక్కులు, ఆయుష్మాన్ వైద్య బీమా కార్డు ద్వారా లబ్ది చేకూర్చనున్నారు. అనాధలైన పిల్లల పేరిట ఖాతాలో రూ. 10 లక్షలు జమ చేశారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాలలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు కలిగిన నష్టం పూడ్చలేనిదని, ఆ కష్టం మాటల్లో చెప్పలేనిదని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులకు ఎంతోకొంత అండగా నిలుస్తూ వారిని ఆదుకోవాలనే సంకల్పంతో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం ను అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతీ నెల నాలుగు వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందిచడం జరుగుతుందని, పాఠశాల విద్య పూర్తి చేసుకున్న వారికి 18 నుండి 23 సంవత్సరాల వరకు స్టయిఫండ్ చెల్లిస్తారని, ఆయుష్మాన్ హెల్త్ కార్డు ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకుంటూ సానుకూల దృక్పథం, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని బాధిత బాలలకు ప్రధాని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, డి సి పి ఓ రత్నం, సిడబ్ల్యుసి సభ్యులు వెంకటేశం, వేరోనికా, విష్ణుమూర్తి, డి సి పి యు సిబ్బంది లింగం, రామకృష్ణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Share This Post