పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం ను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని

కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద నిజామాబాద్ జిల్లాలో అర్హులైన పది మంది బాధిత బాలలకు స్థానిక అధికారులు ఆర్ధిక ప్రయోజనానికి సంబంధించిన బాండ్ లను కలెక్టరేట్ లోని ఎన్ ఐ సి కార్యాలయంలో అందజేశారు. వీరిలో ఆరుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉపకార వేతనాలు, పీ ఎం కేర్స్ పాస్ బుక్కులు, ఆయుష్మాన్ వైద్య బీమా కార్డు ద్వారా లబ్ది చేకూర్చనున్నారు. ఎంపికైన పిల్లల పేరిట ఖాతాలో పది లక్షలు జమ చేశారు. వారికి 23 సంవత్సరాల వయస్సు నిండిన అనంతరం ఏక మొత్తంగా దానిని అందించనున్నారు. అప్పటి వరకు డిపాజిట్ మీద వచ్చే వడ్డీని వారికి చదువు, ఇతర అవసరాల కోసం సమకూర్చనున్నారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాలలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు కలిగిన నష్టం పూడ్చలేనిదని, ఆ కష్టం మాటల్లో చెప్పలేనిదని ఆవేదన వెలిబుచ్చారు. బాధితులకు ఆప్తుల జ్ఞాపకాలే తీపి గుర్తులుగా మిగిలాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులకు ఎంతోకొంత అండగా నిలుస్తూ వారిని ఆదుకోవాలనే సంకల్పంతో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం ను అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతీ నెల నాలుగు వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందిచడం జరుగుతుందని, పాఠశాల విద్య పూర్తి చేసుకున్న వారికి 18 నుండి 23 సంవత్సరాల వరకు స్టయిఫండ్ చెల్లిస్తారని వివరించారు. 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి మొత్తం 10 లక్షల రూపాయలను అందజేస్తారని అన్నారు. అంతేకాకుండా ఆయుష్మాన్ హెల్త్ కార్డు ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. నిజానికి తల్లిదండ్రులు లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని, ఇలాంటి కష్టకాలం యావత్ భారతావని బాధిత బాలల వెన్నంటి ఉందనే భరోసాను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కరోనా వల్ల ఏర్పడిన కష్టాలు తొలగిపోతాయని, ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకుంటూ సానుకూల దృక్పథం, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని బాధిత బాలలకు ప్రధాని పిలుపునిచ్చారు. కాగా, యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేసిన కరోనా సంక్షోభాన్ని భారత్ ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొందని గుర్తు చేశారు. ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు సైతం మన దేశాన్ని అభినందించాయని అన్నారు. ఇదే స్పూర్తితో ప్రపంచ సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు సాగుదామని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఝాన్సీ, డీఆర్డీఓ చందర్, డీ ఎం హెచ్ ఓ డాక్టర్ సుదర్శనం, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ రావు, బాల సంరక్షణ విభాగం అధికారి చైతన్య కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
———————-

Share This Post