పెండింగ్ రెవెన్యూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి – అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్

ఆర్డివోలు, తహశీల్దార్లతో రెవిన్యూ పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

జిల్లాలో అన్ని మండలాల్లో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలకు సంబంధిత మండల తహశీల్దార్లు సత్వర పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ ఎస్. మోతిలాల్ ఆదేశించారు.  కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆర్డివోలు, అన్ని మండలాల తహశీల్దార్లతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని మండలాల్లో పెండింగ్ లో ఉన్న ప్రజావాణి, లోకాయుక్త, మానవ హక్కుల, సీఎం ప్రజావాణి, కోర్టు కేసులు పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రజావాణిలో 175 దరఖాస్తులు, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన గ్రీవెన్స్ ద్వారా 10 దరఖాస్తులు, మానవ హక్కుల కమిషన్ ద్వారా వచ్చిన 12 దరఖాస్తులు, లోకాయుక్త ద్వారా వచ్చిన 14 దరఖాస్తులు, ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా వచ్చిన 27 దరఖాస్తులు, పెండింగ్లో ఉన్నాయని, వాటినన్నిటిని వెంటనే పరిష్కరించాలని ప్రజల సమస్యలను వేగవంతంగా ఏలాంటి పెండింగ్ లేకుండా పరిష్కారం చూపాలన్నారు.
క్రీడా ప్రాంగణాలకు కావలసిన ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించి, అందజేయాలని ఆదేశించారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు 1565 దరఖాస్తులు రాగా ఇంకా 689 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటినన్నిటినీ వెంటనే మంజూరుకు పరిష్కారం చూపించి సంబంధిత లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందేలా చూడాలన్నారు.
పెండింగ్ కేసులపై సంబంధిత ఆర్డివోలు పర్యవేక్షించి కేసుల పరిష్కారానికి శ్రద్ధ చూపాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్డివోలు నాగలక్ష్మి, హనుమంతు నాయక్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు తాహసిల్దారు తదితరులు పాల్గొన్నారు.

Share This Post