పెబ్బేరులోని పి.జె.పి. క్యాంపు కార్యాలయంలో 2021-22 సం. యాసంగిలో పంటలు సాగు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, రాజోలి బండ డైవర్షన్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సాగునీటి సలహా బోర్డు, సాగునీటి విడుదల అంశాలపై సమావేశం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:31.12.2021, వనపర్తి.

2021-22 యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయడానికి ప్రణాళికాబద్ధంగా రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువల ద్వారా సాగు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం పెబ్బేరులోని పి.జె.పి. క్యాంపు కార్యాలయంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సాగునీటి సలహా బోర్డు, సాగునీటి విడుదల అంశాలపై నిర్వహించిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న జిల్లా అని, ఈ జిల్లాలో 35 లక్షల ఎకరాల భూములు సాగుకు యోగ్యంగా ఉంటాయని మంత్రి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు యాసంగిలో పంటలకు సాగునీరు అందించడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లాలని మంత్రి తెలిపారు. భగీరథ ప్రయత్నం చేస్తే తప్ప, ప్రతి ఎకరాకు నీరు లభించదని, జూరాల ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా గత ఏడు సంవత్సరాల నుండి రెండు పంటలకు నీరు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు పొందేందుకు కృషి చేస్తూ, తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ 1, 2 పంపులు పూర్తి అయితే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని మంత్రి సూచించారు. ప్రాజెక్టుల పనుల పురోగతిపై సంబంధిత శాఖ ఇంజనీర్లు కృషి చేయాలని, ప్రాజెక్టుల పనులను సత్వరం పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. కాలువల డిస్ట్రిబ్యూటర్లు సరిగ్గా ఉండేలా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.
ఉమ్మడి జిల్లాలోని యాసంగిలో ఆరుతడి పంటలకు సాగునీరు అందించుటకు జూరాలకు 34 వేల 4 వందల 13 ఎకరాలకు, ఆర్.డి. ఎస్. కింద 21 వేల ఎకరాలకు, నెట్టెంపాడు కింద 30 వేల ఎకరాలకు, రాజీవ్ భీమా కింద 51 వేల 8 వందల ఎకరాలకు సాగునీరు అందించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ ద్వారా  9.583 టీఎంసీ, మిషన్ భగీరథ ద్వారా 2.663 టీఎంసీ.ల నీరు అందుబాటులో ఉన్నట్లు మంత్రి తెలిపారు.
నాగర్ కర్నూల్ ఎంపీ రాములు మాట్లాడుతూ సాగునీటి సలహా బోర్డు సమావేశం ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని అధికారులను ప్రశ్నించారు. ముందస్తుగా సమాచారం ఇస్తే తాను విషయం తెలుసుకుంటానని అన్నారు.
వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా అన్ని శాఖల ద్వారా అవగాహన కల్పిస్తామని అన్నారు.
గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ వచ్చే యాసంగిలో ఏ మేరకు నీటిని వదలాలి, ఇరిగేషన్ అధికారుల ద్వారా వివరించారు.
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ఆర్.డి.ఎస్. అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య సాగునీటి వనరుగా ఉందని, చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా ఆర్ డి ఎస్  పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కోయిల్ సాగర్ కింద ఎడమ కెనాల్ కింద పనులు జరుగుతున్నాయని, ఎడమ, కుడి కెనాల్ వద్ద పనులకు జనవరి నుంచి నీళ్లు ఇవ్వాలని, మార్చి 30 వరకు నీళ్లు అందించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కోయిల్ సాగర్ కెనాల్ లో మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాలని, ప్రత్యేకంగా CE , SC , EE లకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ లు స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఆర్ లోకనాథ్ రెడ్డి, సరిత, ఎమ్మెల్యేలు డాక్టర్ అబ్రహం, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా పరిషత్ చెర్మన్లు, జిల్లా కలెక్టర్ లు , మహబూబ్నగర్ అదనపు కలెక్టర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఇరిగేషన్ శాఖ సీ ఈ లు రఘునాథరావు, రమేష్ హమీద్ ఖాన్, ఎస్ ఇ ఈ లు సత్యశీల రెడ్డి , శ్రీనివాసరావు, విజయ భాస్కర్ రెడ్డి,  ఏ ఎస్ ఎన్ రెడ్డి, డి ఈ తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post