పేదప్రజల కోసం వీరోచితంగా పోరాడిన పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ -ఎమ్మెల్యే జోగు రామన్న

సెప్టెంబర్ 26, 2021, ఆదిలాబాదు:-

            పేదలపై జరిగిన అన్యాయాలపై న్యాయపరంగా, చట్ట పరంగా పోరాడిన వీర నారి చిట్యాల చాకలి ఐలమ్మ అని ఆదిలాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు జోగు రామన్న అన్నారు. చాకలి ఐలమ్మ 126 వ జయంతి సందర్బంగా ఆదివారం రోజున రిమ్స్ ఆసుపత్రి ముందు జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తొలుత ఐలమ్మ విగ్రహానికి శాసన సభ్యులు, అదనపు కలెక్టర్, కుల సంఘాల నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శాసన సభ్యులు మాట్లాడుతూ, రజక సంఘాల సహకారం, వెనకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. పేదవారిపై జరిగిన అన్యాయాలను న్యాయ పరంగా, చట్ట పరంగా పోరాటం జరిపిన వీర నారి అని, వరంగల్ గడ్డపై సాధారణ కుటుంబం లో పుట్టి తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొన్న మహోన్నత మహిళా అని కొనియాడారు. పాలకుర్తి మార్కెట్ యార్డ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వెనకబడిన తరగతుల 126 కులాలకు సంబంధించి ఎంబీసీ ఏర్పాటు చేసి తాడూరి శ్రీనివాస్ ను చైర్మన్ గా నియమించడం జరిగిందని, వెయ్యి కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల విద్యుత్ వాడకం ఉచితంగా అందించడం జరుగుచున్నదని తెలిపారు. 40 లక్షల రూపాయలతో మోడ్రన్ దోబీ ఘాట్ పనులు త్వరలో పూర్తిచేసుకొని ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం జరుగుతున్నదని తెలిపారు. ఐలమ్మ విగ్రహం వద్ద వాహనాలు పార్కింగ్ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని ఈ సందర్బంగా ఎమ్యెల్యే కోరారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, రజాకార్ల పాలనకు భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం పరిచిన మహోన్నత వ్యక్తి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. వరంగల్ ప్రాంతంలో సర్వాయి పాపన్న, ఐలమ్మ పేర్లు అలనాడు ప్రాచుర్యం పొందాయని తెలిపారు. రజకుల సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు మాట్లాడుతూ, రజకులకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలనీ, ఇస్త్రీ పెట్టెలను సరఫరా చేయాలనీ కోరారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న ను, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ ను శాలువాలతో సత్కరించారు. రజకులకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యేకు, అదనపు కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బీసీ సంక్షేమ అధికారి రాజలింగం, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, బీసీ సంక్షేమ నాయకులు, అధికారులు, రజక సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే వీరనారి చాకలి ఐలమ్మ గొప్పతన్నాని తెలియజేస్తూ పాటల రూపంలో ప్రదర్శించారు.

Share This Post