పేద ఇంటి ఆడపడుచులకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరెలు:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు

జనగామ, అక్టోబర్ 2: పేద ఇంటి ఆడపడచులకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరేలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. శనివారం జిల్లాలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లో బతుకమ్మ చీరేల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌ పండుగ‌ల‌ని నిర్వ‌హిస్తున్న‌దని అన్నారు. రూ. 333 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని ప్రతి అక్క, చెల్లె, అమ్మకు చీరెలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. రెండు సంవత్సరాలుగా కరోనాతో ఎంతో ఇబ్బదిపడ్డామన్నారు. రాష్ట్ర ఆదాయం లేదు, అన్ని వ్యవస్థలు బంద్ అయి, ఒకరినొకరు పలకరించే పరిస్థితి లేకుండా అయింది. వేరే ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పధకాలు లేనప్పటికీ, కరోనా సమయంలో వున్న సంక్షేమ పధకాల అమలు చేయలేదు. కాని పేదల పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి కష్టకాలంలో అప్పు తెచ్చి, పేదలకు ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి ఇచ్చారన్నారు. కరోనా సమయంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున నియోజకవర్గంలో మాస్కులు, సానిటైజర్లు పంపినీచేసినట్లు, 50 లక్షలు ఖర్చు పెట్టి ఆనందయ్య మందు ఇంటింటికి అందజేసినట్లు ఆయన తెలిపారు. 40 వేల కోట్లు ఖర్చుపెట్టి గోదావరి నీటిని శుద్దిచేసి ఇంటింటికి నల్లా ద్వారా అందజేస్తున్న మహానుభావుడు కెసిఆర్ అని ఆయన అన్నారు. ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారుకు పెరగగా, ఇంటిలో పెద్ద వారికి గౌరవం పెరిగిందని ఆయన అన్నారు. వచ్చే నెల నుండి 57 సంవత్సరాలు నిండిన వారికి క్రొత్తగా పెన్షన్లు మంజూరుచేస్తామన్నారు. ఇండ్ల స్తలాలు ఉన్నవారికి ఇండ్లు కట్టి ఇచ్చే పధకం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గ్రామాలు, తండాలు బాగుచేసుకున్నామని, ట్రాక్టర్లు, ట్యాంకర్లు సమకూర్చుకున్నామని, పల్లెలు పరిశుభ్రంగా మారాయని ఆయన అన్నారు. కరోనా వ్యాక్సిన్ ఇంటింటికి ఇస్తున్నట్లు, వ్యాక్సిన్ తీసుకొని జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా వచ్చినా ప్రాణాపాయం ఉండదని, త్వరగా తగ్గిపోతుందని ఆయన అన్నారు. జిల్లాలో 3 లక్షల మొదటి డోసులు, 80 వేల రెండో డోసులు ఇప్పటికి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మహిళా గ్రూపులకు ఋణాలు ఇస్తామని, కోటి రూపాయల బిజినెస్ చేసిన అందజేయడానికి సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు. స్త్రీ నిధి నుండి ఋణాలు అందజేస్తామన్నారు. మంత్రి ప్రజలకు ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, జిల్లాలో రూ. 8 కోట్ల 50 లక్షల విలువైన 2 లక్షల చీరేలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 24 డిజైన్లు, 810 రంగులతో చీరెలు వున్నట్లు ఆయన అన్నారు. గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యంమని, ఇప్పుడు గ్రామాల్లో ఎంతో మార్పు వచ్చినట్లు చెప్పవచ్చని అన్నారు. ప్రతి గ్రామంలో స్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, పచ్చదనంతో 2-3 సంవత్సరాలుగా ఎంతో మార్పుతో, గ్రామ స్వరాజ్యం కళ్ళకు కనపడుతుందన్నారు. తెలంగాణా సంస్కృతిలో భాగమైన బతుకమ్మను అందరూ సంబరంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమానికి ముందు జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి మంత్రి, కలెక్టర్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అంతకుముందు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రిపై మహిళలు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. బతుకమ్మలతో, డప్పులు, మేళతాళాలతో సంప్రదాయ బద్దంగా ఎదురేగారు. మంత్రి, జిల్లా కలెక్టర్ బతుకమ్మ ను ఎత్తుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, డిఆర్డివో జి. రాంరెడ్డి, జెడ్పి సిఇవో ఎల్. విజయలక్ష్మి, డిపివో కె. రంగాచారి, ఏడి హ్యాండ్లూం ఎస్. కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post