పొద్దుటూరి సదానంద్ రెడ్డి ట్రస్ట్ సేవలు అభినందనీయం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి అనాధాశ్రమాన్ని ప్రారంభించిన – కలెక్టర్ సామాజిక సేవకు దాతలు ముందుకు రావాలని పిలుపు


నిజామాబాద్, మే 31 : పొద్దుటూరి సదానంద్ రెడ్డి ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో పొద్దుటూరి సదానంద్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అనాధాశ్రమాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆర్మూర్ శాసన సభ్యులు ఆశన్నగారి జీవన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో కూడిన విశాలమైన గదులతో అనాధాశ్రమాన్ని నిర్మించడం పట్ల కలెక్టర్ ట్రస్టు ప్రతినిధులను, నిర్వాహకులను ప్రశంసించారు. ఇప్పటికే గత చాలా కాలంగా వృద్దుల కోసం ఆశ్రమం నిర్వహిస్తున్న సదానంద్ రెడ్డి ట్రస్టు, మానవతా దృక్పధంతో ముందుకు వచ్చి అనాధ బాలల కోసం ఇదే ప్రాంగణంలో అన్ని వసతులతో నూతనంగా అనాధాశ్రమం నెలకొల్పడం ఎంతో మంచి కార్యక్రమమని అన్నారు. డబ్బులు కలిగిన వారు అనేక మంది ఉంటారని, వారిలో కొద్దిమంది మాత్రమే సామాజిక సేవకు చొరవ చూపుతారని, ఈ కోవలో సదానంద్ రెడ్డి సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలుస్తున్నారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాలకు దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తద్వారా ప్రభుత్వానికి తోడ్పాటుగా నిలుస్తూ, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆపన్నహస్తం అందించినట్లు అవుతుందని అన్నారు. అనాధ బాలలకు అన్ని వసతులతో ఉచితంగా ఆశ్రయం కల్పించేందుకు చొరవ చూపిన పొద్దుటూరి సదానంద్ రెడ్డి ట్రస్టుకు జిల్లా యంత్రాంగం తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ సదానంద్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
——————————-

Share This Post