పొన్నారి గ్రామాన్ని వందశాతం వ్యాక్సినేషన్ గ్రామంగా ప్రకటించుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 17, 2021ఆదిలాబాదు:-

పొన్నారి గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్ సాధించి, మొట్టమొదటి గ్రామంగా ప్రకటించే విధంగా గ్రామస్తులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున తాంసీ మండలం పొన్నారి గ్రామ పంచాయితీలో ఏర్పాటు చేసిన  వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఇప్పటికే తీసుకున్నవారు చుట్టుపక్కల గృహాల్లోని వారికీ అవగహన కల్పిస్తూ ప్రోత్సహించాలని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం గ్రామస్తులు వ్యాక్సిన్ కేంద్రానికి తరలి రావడం అభినంద నియమని, గ్రామంలోని ప్రజలు ఐక్యత తో కలిగి ఉన్నారని విదితమౌతున్నదని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికీ తదుపరి రెండవ డోస్ ఎన్ని రోజులకు తీసుకోవాలో వివరించాలని, ఏమైనా జ్వరం, ఇతర అనారోగ్య సంబంధ విషయాలకు సమీపం లోని వైద్యులను సంప్రదించే విధంగా వివరించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారందరు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పొందు పరచాలని అన్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ, ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పవద్దని, ప్రతి ఒక్కరు తీసుకునే విధంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని అందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలని అన్నారు. పొన్నారి గ్రామపంచాయితీలో కలెక్టర్ మొక్కలను నాటారు. గ్రామస్తులు కలెక్టర్ తో మాట్లాడుతూ, గత సంవత్సరం కలెక్టర్ నాటిన మొక్కను సంరక్షించామని తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలోని తరగతులను పరిశీలించి విద్యార్థుల హాజరు, బోధనా వివరాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో బోర్డు పై రాసిన ఆంగ్ల పదాలను కలెక్టర్ చదివించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన తో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం వంట గదిని కలెక్టర్ పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పౌర సరఫరాల అధికారి, మండల ప్రత్యేక అధికారి సుదర్శన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా విద్య ఆరోగ్య శాఖ అధికారి సాధన, ఎంపీడీఓ రవీందర్, సర్పంచ్ సంజీవ్ రెడ్డి, ఎంపీటీసీ ఎం.రేఖ, ఉప సర్పంచ్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post