పోడు పేరుతో అడవులను నరుక్కుంటూ పోతే చెట్లే మిగలవని, మానవాళి మనుగడ ప్రమాదంలో పడిపోతుందని అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం టేకులపల్లి మండలం ఎర్రాయిగూడెం గ్రామంలో పోడు భూముల అవగాహన సదస్సు, దరఖాస్తులు పంపిణీ, ప్రాధమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ అటవీహక్కుల చట్టం ప్రకారం జీవనాధారం కోసం పోడు కొట్టిన వారి యొక్క ఆధారాలు పరిశీలించి హక్కులు కల్పనకు చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రజలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. 12వ తేదీతో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందని, తదుపరి విచారణకు అధికారులు భూములు పరిశీలన వస్తారు కాబట్టి ప్రజలు ఆధారాలను సిద్ధంగా ఉంచుకుని భూమిని చూపించే విధంగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. సాగు చేస్తున్న రైతాంగం పట్టాలు, హక్కులు లేక, రైతుబంధు రాక ఇబ్బందులు పడుతున్నారని గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పోడు సాగు చేస్తున్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తులను కూడా ఉచితంగానే ఇస్తున్నామని, ఇందుకొరకు ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మోసగాళ్లు తయారవుతారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరి మాటలు నమ్మొద్దని, ఏవేని అనుమానాలు, సందేహాలుంటే కమిటి సభ్యులను కానీ అధికారులను కానీ సంప్రదించాలని చెప్పారు. ప్రలోభాలకు గురిచేసే వ్యక్తులను జైల్లో పెట్టిస్తామని చెప్పారు. అడవులను కొడుతుంటే పట్టాలు రద్దు చేస్తామని కాబట్టి కాపాడుకునే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పారు. నరుక్కుంటూ పోతే అడవులు అంతరించి మానవాళి ప్రమాదంలో పడిపోతుందని, అందువలన అడవులను రక్షించుకోవాలని చెప్పారు. జిల్లాలో 229229 ఎకరాల పోడు భూములున్నాయని చెప్పారు. అందరికీ న్యాయం జరుగుతుందని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, దరఖాస్తు చేయు విధానాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ప్రాధమిక పాఠశాలను సందర్శించి మద్యాహ్న భోజన మెనూను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించి మంచిగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఆటా, పాటలతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని, ఈ బాల్యం మళ్లీ జీవితంలో తిరిగి రాదని విద్యార్థులను ఉన్నతులు తీర్చిదిద్దాలని ఉపాధ్యాయునికి సూచించారు. పాఠశాల ప్రహరి నిర్మాణాలనికి ప్రతి పాదనలు పంపాలని కార్యదర్శిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న కోడి గుడ్లును పరిశీలించారు. గుడ్లు చక్కగా ఉన్నాయని చిన్న సైజులో ఉన్న గుడ్లును తీసుకోవద్దని సిబ్బందిని ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్య కార్డులు నిర్వహించాలని చెప్పారు. చిన్నారులను బరువు చూసే పరికరాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాలతో కూడిన ఆహారాన్ని అందించాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రానికి రంగులు వేయుటకు, భవన మరమ్మత్తులకు ప్రతిపాదనలు రూపొందించాలని కార్యదర్శికి సూచించారు. ఎర్రాయి గూడెం కూడలిలో మినీ అంగన్వాడీ కేంద్రం మంజూరైందని, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో యంపిపి రాధ, సర్పంచ్ నిర్మల, తహసిల్దార్ శ్రీనివాసరావు, యంపిడిఓ బాలరాజు, యంపిట గణేష్ గాంధీ, ఎఫ్టీఓ ముక్తార్ హుస్సేన్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Share This Post