రాజన్న సిరిసిల్ల, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడు భూముల గుర్తింపుకు చేపట్టాల్సిన సర్వేలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహశీల్దార్లతో సమీక్షించి, పోడు భూముల గుర్తింపుకు చేపట్టాల్సిన సర్వే, ధరణి, రెండు పడక గదుల ఇండ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, కోర్టు కేసుల పురోగతి, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోడు భూముల గుర్తింపుకు చేపట్టాల్సిన సర్వేలో అటవీ అధికారి, సర్వేయర్, పంచాయితీ సెక్రటరీ, వీఆర్వో కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామస్థాయిలో పోడు భూముల గుర్తింపుపై సోమవారం నుండి సర్వే ప్రారంభించాలని, గ్రామ సభ తీర్మానం అనంతరం సంబంధిత డాక్యుమెంట్ లను ఆయా మండలాల తహశీల్దార్లకు పంపించాలని సూచించారు. మండల స్థాయిలో పరిశీలించిన అనంతరం ఆర్డీఓ కు పంపాలని ఆదేశించారు. కమిటీ లు ఇంకా కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయలేదని, సాధ్యమైనంత త్వరగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సర్వేకు అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు కలెక్టరేట్ నుండి మండల అధికారులు శనివారం తీసుకోవాలని సూచించారు. ధరణి, కోర్టు కేసులు, రెండు పడక గదుల ఇండ్లకు సంబంధించిన రెవెన్యూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రతీ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మించడానికి 2 ఎకరాల భూమిని గుర్తించాలని అన్నారు. పాఠశాలల ప్రదేశంలో అయితే ఇంకా అనువుగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, కలెక్టరేట్ ఏఓ గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.