ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేస్తూ అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం కల్పించడంతో పాటు అడవులు సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో పోడు , అటవీ సంరక్షణపై ప్రజాప్రథినిధులతో ఏర్పాటు చేసిన అఖిలపక్షం జిల్లా స్థాయి అవగాహన సమావేశంలో మాట్లాడుతూ పోడు భూముల శాశ్వత పరిష్కారానికి, అడవులను సంరక్షించుటకు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారని అన్నారు. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 6,80,570 ఎకరాలు కాగా అందులో 1,42,387 ఎకరాలు అనగా 21 శాతం మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయని అన్నారు. కాగా జిల్లాలో డిసెంబర్ 13, 2005 నాటికీ 17 మండలాలలోని 82 గ్రామ పంచాయతీలలో గల 85 హాబిటేషన్ లలో 3,265 మంది 6,866 ఎకరాలలో పోడు సాగుచేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. పోడు సాగు చేస్తున్న నిజమైన గిరిజన, గిరిజనేతరులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు అందించడంతో పాటు, ఇకముందు అటవీ భూములు ఆక్రమణలు జరుగకుండా, వాటి పునర్జీవనానికి అటవీ రక్షణ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు నేటి నుండి డిసెంబర్ 8 వరకు క్లెయిమ్స్ (అభ్యంతరాలు ) స్వీకరిస్తున్నామని అన్నారు. ఇందుకోసం గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలతో పాటు అటవీ సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేశామని ఇందులో అటవీ, గిరిజన, రెవిన్యూ శాఖ నుండి సభ్యులుగా ఉంటారని, వీరితో పాటు గిరిజనులు, మహిళలు సభ్యులుగా ఉంటారని అన్నారు.
గ్రామ స్థాయి కమిటీలో మొదటి పది రోజులు ఫారం-ఏ క్లైమ్స్ స్వీకరించి, క్లెయిమ్ దారు సమక్షంలో క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలని, ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలను, రిజిస్టర్లను పక్కాగా నమోదు చేస్తూ అర్హులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పత్రాలు అందేలా చూస్తామని అన్నారు. గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా క్లెయిమ్స్ చేయవచ్చని అన్నారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం ఎప్పటి నుండి జరుగుతుందన్న విషయాన్ని శాస్త్రీయంగా నిర్థారించేందుకు శాటిలైట్ మ్యాపుల ప్రకారం సాంకేతికతతో జి.పి .ఎస్. సిస్టం ద్వారా 2005 కు ముందు అటవీ ప్రాంతం, 2006 లో ఏ విధంగా ఉందొ గుర్తిస్తారని అన్నారు. గిరిజనులకు అక్షరజ్ఞానం లేక పోడు భూములు సాగుచేస్తున్న హక్కు పత్రాలు పొందలేక పోయారని, ఈ నూతన చట్టం ద్వారా గ్రామా సభలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు హక్కు పత్రాలు అందజేస్తామని , ఇందుకు ప్రజాప్రథినిధులు, అధికారుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఆ తరువాత అటవీ భూమి ఆక్రమణలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నామని అన్నారు.
మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పట్టా ఇచ్చినా పోశేషన్ చూయించక చాలా సమస్యలు వచ్చాయని, వాటి శాశ్వత పరిష్కారానికి చరమగీతం పాడాలనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అటవీ భూములు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్న నిజమైన గిరిజనులు ప్రభుత్వ పథకాలైన రైతు బందు, రైతు భీమా వంటి సౌకర్యాలు పొందలేకప్లోతున్నారని, 2005 కు ముందు 75 సంవత్సరాలుగా సాగు చేస్తున్న రైతులను గుర్తించి హక్కు పత్రాలు అందించడంతో పాటు అటవీ ఆక్రమణ, పునర్జీవనం చేయాలని ముఖ్యమంత్రి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
నరసాపూర్ శాసనసభ్యుడు మదన్ రెడ్డి మాట్లాడుతూ పోడు భూముల సమస్యలకు ఇంతటితో చెక్ పెట్టి, అర్హులకు న్యాయాయం చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన అని, ప్రజాప్రథినిధులు విమర్శలకు పోకుండా అధికారులకు సహాకారమందించాలని కోరారు.
దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్ రావు మాట్లాడుతూ చేగుంట మండలం ఇబ్రహీంపూర్, నార్సింగి మండలం భీంరావు పల్లి, చేగుంట మండలం చెట్లతిమ్మాయిపల్లి, పోతారం, మాసాయిపేట తదితర గ్రామాలలో దశాబ్దాల నుండి పోడు సాగు చేస్తున్నారని, ప్రత్యేక అధికారిని నియమించి ఆ గ్రామాలలో సర్వే చేపట్టి నిరక్షరాస్యులైన గిరిజనులు, గిరిజనేతరులకు న్యాయం చేయవలసినదిగా కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్, డి.ఎఫ్.ఓ. రవి ప్రసాద్, జ్ఞానేశ్వర్, ఆర్.డి.ఓ. సాయి రామ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణ్ రెడ్డి, జిల్లా అధికారులు, జెడ్.పి .టి.సి.లు, ఏం.పి పి .లు తదితరులు పాల్గొన్నారు.
పోడు భూములు అటవీ సంరక్షణ పై అఖిలపక్ష సమావేశం – జిల్లా కలెక్టర్ హరీష్
