పోడు భూముల పట్టాల జారీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

పోడు భూముల పట్టాల జారీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలకు పరిష్కారం లభించనుందని అన్నారు. పోడు భూముల్లో సాగు చేస్తున్న వారి నుండి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేసి, గ్రామ సభలు తదితర పకడ్బందీ కార్యాచరణ చేసి, అర్హులైన వారికి పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పోడు భూములకు సంబంధించి జిల్లాలో 10 మండలాలకు చెందిన 94 గ్రామ పంచాయతీల్లోని 132 ఆవాసాల నుండి దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు. షెడ్యూల్ తెగలకు సంబంధించి 9,507 దరఖాస్తులు 25,515 ఎకరాల్లో హక్కు పత్రాల కొరకు రాగా, ఇతరుల నుండి 8,980 దరఖాస్తులు 17,678 ఎకరాలు, మొత్తంగా 18,487 దరఖాస్తులు 43,193 ఎకరాల్లో హక్కు పత్రాల కొరకు వచ్చాయన్నారు. క్షేత్ర స్థాయిలో సర్వే, విచారణ అనంతరం గ్రామ సభలు నిర్వహించి, తీర్మాణం చేపట్టి, అట్టి తీర్మానాలు డివిజన్ స్థాయిలో ఎస్డిఎల్సి పంపుట, అక్కడ ఆమోదం తదుపరి, జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీకి సిఫారసు చేయుట జరుగునని ఆయన అన్నారు. షెడ్యూల్ తెగలకు సంబంధించి 6,795 దరఖాస్తులు, 13,560 ఎకరాలపై, అదనపు ప్యాచుల కొరకు 2,588 దరఖాస్తులు 2,074.23 ఎకరాలకు గ్రామ సభ నిర్ణయాలు పూర్తయ్యాయన్నారు. డివిజన్ స్థాయి కమిటీచే 3,249 దర్సఖాస్తులకు గాను 4,232.15 ఎకరాలకు సిఫారసు అయినట్లు ఆయన తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో డివిజన్ స్థాయి కమిటీచే సిఫారసు అయిన దరఖాస్తులపై చర్చించి, సభ్యుల అభిప్రాయాలను నమోదుచేశారు. అభ్యంతరాలుంటే పరిశీలించి, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూలంకషంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందని కలెక్టర్ అన్నారు.

సమావేశంలో భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూ మాట్లాడుతూ, ఎస్డిఎల్సీచే సిఫారసు చేయబడిన దరఖాస్తులకు సంబంధించి జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీలో చర్చించినట్లు తెలిపారు. డివిజన్ స్థాయి కమిటీచే, కల్లూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో 22 ఆవాసాల నుండి 684 దర్సఖాస్తులకు సంబంధించి 693.48 ఎకరాలు, ఖమ్మం డివిజన్ పరిధిలో 83 ఆవాసాల నుండి 3,249 దరఖాస్తులకు సంబంధించి 4,232.15 ఎకరాల్లో హక్కు పత్రాలకు సిఫారసు అయినట్లు తెలిపారు. మిగులు ఆవాసాలకు సంబంధించి డివిజన్ స్థాయి కమిటీ సమావేశాలు చేపట్టి, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాల జారీకి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఆర్డీవో లు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణ నాయక్, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శ్రీనివాసులు, అటవీ అభివృద్ధి అధికారులు ప్రకాష్ రావు, మంజుల, ఎఫ్ఆర్వో రాధిక, రఘునాథపాలెం, సింగరేణి, ఏన్కూరు జెడ్పిటిసి లు మాలోతు ప్రియాంక, వాంకుడొతు జగన్, బానోతు బుజ్జి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post