పోడు భూముల సమస్యల పరిష్కారంలో పార్టీలకతీతంగా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా, అర్హులైన వారిని కాపాడుదామని, దీనికి అందరం బాధ్యత తీసుకుందామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.

సోమవారం నాడు భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన అడవుల సంరక్షణ,  పోడు భూములపై అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  భూమి మీద 33 శాతం అటవీ భూమి ఉంటే మానవజాతి బతుకుతుందని అన్నారు.  అటవీ భూములను కాపాడుతూ, గిరిజనులకు హక్కులు కల్పించాలని,  వారి జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలని 2006 లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, దానికి లోబడి సాగుచేస్తున్న వారికి  హక్కు కల్పించడం జరుగుతుందని అన్నారు.  రాష్ట్రంలో 6 లక్షల దరఖాస్తులు రాగా రెండు లక్షల తొంభై వేల ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
యాదాద్రి  జిల్లాలో మొత్తం ఎనిమిది లక్షల 4 వేల 300 ఎకరాల భూమిలో 29 వేల 531 ఎకరాల అటవీ భూమి ఉందని తెలిపారు. జిల్లాలో  చౌటుప్పల్, తుర్కపల్లి నారాయణపూర్ మండలాలకు సంబంధించి 8 గ్రామాలలో 1318 ఎకరాల పోడు భూమి ఉన్నట్లు గుర్తించామని,  326 మంది ఎస్టీలకు సంబంధించి 702 ఎకరాలు,  57 ఎస్సీ లకు సంబంధించి 127 ఎకరాలు, ఇతరులు 159 మందికి 489 ఎకరాలు సంబంధించి హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉందని, దీనికై  ఈ రోజు నుండి ఆ గ్రామాలలో గ్రామ సభల ఏర్పాటుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతున్నదని‌,  వచ్చిన ఫిర్యాదులను గ్రామ కమిటీ,  డివిజన్ కమిటీ,  జిల్లా కమిటీల పరిశీలనలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పోడు వ్యవసాయదారులకు న్యాయం చేసేందుకు,  అడవులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, తాను కూడా సబ్ కమిటీ లో సభ్యునిగా ఉన్నానని, అటవీ హక్కుల చట్టం- 2006 పరిధికి లోబడి పోడు వ్యవసాయ దారులకు న్యాయం చేకూర్చేందుకు అఖిలపక్ష సభ్యుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని, రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాల పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు తీసుకుంటున్న కార్యక్రమాలలో అటవీ శాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖల, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రజా ఉద్యమంగా  పెద్ద ఎత్తున భాగస్వాములై చెట్లు నాటుతున్నారని, హరిత హారం ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 24 శాతం అటవీ విస్తీర్ణం ఉండగా, జిల్లాలో 3 శాతం అటవీ విస్తీర్ణం ఉందని  తెలిపారు. ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణకు కట్టుబడి ఉండాలని, మానవ, జీవ జాతుల మనుగడ అడవుల సంరక్షణ పై ఆధారపడి ఉందని అన్నారు. అడవుల క్షీణత  వలన గ్లోబల్ వార్మింగ్ తో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, పర్యావరణ సమస్యలు వస్తున్నాయని, అడవుల పునరుద్ధరణలో దేశంలోనే రాష్ట్రం ముందుందని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అటవీ శాఖ గుర్తించిన దాని కంటే ఇంకా ఎక్కువ భూమి ఏదైనా ఉంటే చెప్పాలని వాటి పైన కూడా గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుందని,  ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరుగవద్దని, ఇదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు.  నిన్న ఇవాళ ఎవరైనా కొత్తగా భూములు ఆక్రమిస్తే చర్యలు ఉంటాయని ఇలాంటివి దృష్టికి వస్తే పార్టీలకతీతంగా అందరూ పని చేయాలని, అర్హులను కాపాడుకుందామని, ఉన్నవారికి హక్కుల కోసం అందరం బాధ్యత తీసుకుందామని  అన్నారు.   ఇటీవల వేపచెట్లు తెగులు  సోకి ఎండిపోతుండం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరడం జరిగిందని తెలిపారు. తెగులు నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వేప చెట్టే  ఒక మందు లాగా పనిచేస్తుందని,  అలాంటి వేప చెట్టే వ్యాధికి గురి అవుతుందంటే  పర్యావరణం ఏ విధంగా కలుషితం అవుతుందో మనం గుర్తించాలని,  వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో వేప చెట్టు తెగులు అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భువనగిరి పార్లమెంట్ సభ్యులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పోడు భూముల సమస్య జటిలమైన సమస్య అని,  ఇలాంటి సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు పెట్టి పరిష్కారానికి కృషి చేయడం పట్ల ముఖ్యమంత్రికి  ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మనం జాగ్రత్తగా ఉంటేనే భవిష్యత్తు తరాల వారికి మంచి పర్యావరణం లభిస్తుందని అన్నారు.  అడవుల పైన ఆధారపడిన వారికి మానవత్వంతో ఒక పరిష్కారం చేపట్టాలని, రాచకొండ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ కనబరచాలని,  సమస్యల పట్ల కృషి చేయాలని,  గిరిజనులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు వారి జోలికి వెళ్లవద్దని కోరుతున్నానని అన్నారు.  పోడు భూముల సమస్యల పరిష్కారానికి  మా మద్దతు ఉంటుందని, అలాగే కమిటీలలో అన్ని పార్టీల వారు ఉండేలా చూడాలని కోరారు.
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ,  ఇది అద్భుతమైన కార్యక్రమమని,  రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన వారికి న్యాయం జరగాలని,  ఇందుకు గాను ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు.  రెవిన్యూ, ఫారెస్ట్ భూముల పరిష్కారం పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్,  ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీత రెడ్డి మాట్లాడుతూ, వేప చెట్ల సంరక్షణ విషయంలో ఫైర్ ఇంజన్ల సహాయంతో తెగులు నివారణ మందులు చల్లి చెట్లు  వాడిపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను  కోరారు.
సమావేశంలో  అఖిలపక్ష నాయకులు బిజెపి నుండి నర్సింగరావు,  సిపిఎం నుండి బాలరాజ్ గౌడ్,  సిపిఐ నుండి అశోక్,  కాంగ్రెస్ నుండి సత్యనారాయణ,  శ్రీమతి బుజ్జి నాయక్,  తెలుగుదేశం నుండి శ్రీనివాస్,  టిఆర్ఎస్ నుండి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పోడు భూముల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అభినందిస్తూ,  కొన్ని సూచనలు సలహాలు అందజేశారు.
అఖిలపక్ష సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,  భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి,  జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి,  జిల్లా రెవెన్యూ అడిషనల్  కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భికూ నాయక్, రెవిన్యూ డివిజనల్ అధికారులు భూపాల్ రెడ్డి,  సూరజ్ కుమార్,  జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తానాయక్,   నారాయణపూర్, తుర్కపల్లి, చౌటుప్పల్ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు,  వివిధ పార్టీల నాయకులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం  పోడు భూముల పరిష్కారం పట్ల అందరం చిత్తశుద్ధితో పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Share This Post