పోడు భూముల సమస్యల పరిష్కారంపై సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష

పత్రికా ప్రకటన -2.   తేది: 06.11.2021. వనపర్తి.

పోడు భూముల సమస్యల పరిష్కారానికి ఈ నెల 8వ తేది నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, ఈ నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శనివారం రాజస్వ మండల అధికారి కార్యలయ  సమావేశ మందిరంలో  పోడు భూముల సమస్యల పరిష్కారానికై ధరఖాస్తుల స్వీకరణలో భాగంగా  అటవీ, రెవెన్యూ,  పంచాయతీరాజ్, సర్పంచ్  లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూముల సమస్యను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా ఈ నెల 8వ తేది నుండి  దరఖాస్తుల స్వీకరణ చేపట్టి  డిసెంబర్ 8వ. తేది వరకు  కొనసాగుతుందని, గ్రామాలలో టాం టాం లు వేయించాలని ఆమె సూచించారు. అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టా, అటవీ భూములను రక్షించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యమని, దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఎలాంటి అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు హెచ్చరించారు.
గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలతో పాటు అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. గ్రామ స్థాయి కమిటీ పాత్ర కీలకమని, దరఖాస్తులు, తీర్మానాలు చేసి, ప్రతి ఒక్కరి దరఖాస్తులు స్వీకరించాలని ఆమె అన్నారు. మొదట సమావేశం ఏర్పాటుచేసి దరఖాస్తుదారులకు అవగాహన కల్పించి, అనంతరం గ్రామసభ నిర్వహించి, దరఖాస్తులు తీసుకుని క్షేత్ర పరిశీలన చేయాలని ఆమె సూచించారు. ఆయా స్థాయి కమిటీలలో తీర్మానాలు, తిరస్కారాలు రిజిస్టర్లు పక్కాగా నమోదు చేయాలని ఆమె సూచించారు. మండల స్థాయి కమిటీలు, ఎక్కువ గ్రామ  పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామంలో, హ్యాబిటేషన్లలో ను సమావేశాలు నిర్వహించాలని ఆమె తెలిపారు.
జిల్లాలో 970 మంది పోడు వ్యవసాయం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎఫ్ఆర్సీ కమిటీలలో 10-15 మంది సభ్యులు ఉండాలని, అందులో ¾ వంతు  మంది  గిరిజనులు కాగా, వారిలో 1/3 వంతు మహిళలు సభ్యులుగా చేర్చాలని ఆమె సూచించారు. జిల్లాలో 36 గ్రామ పంచాయతీలలో   పోడు భూముల ఆక్రమణలో ఉన్నాయని ఆమె అన్నారు. డిసెంబరు 13, 2005 కన్నా ముందు సాగులో  ఉన్న వారు హక్కుపత్రాలు పొందడానికి అర్హులని ఆమె వివరించారు.
ఈ సమావేశం లో అటవీ శాఖ అధికారి రామకృష్ణ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సర్పంచ్ లు,  పంచాయతి సెక్రెటరీలు,  తదితరులు హాజరయ్యారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post