రాజన్న సిరిసిల్ల, నవంబర్ 06: పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కార దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఐటి, పురపాలక, పట్టణాభివృద్ది శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై శనివారం మంత్రి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, 8 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా సుమారు 4 లక్షల 72 వేల 329 ఎకరాల భౌగోళిక విస్తీర్ణం కల్గి వున్నట్లు, ఇందులో ప్రాధమిక అంచనాల ప్రకారం 96 వేల 394 ఎకరాల అటవీ ప్రాంతం 20 శాతం మేర కల్గివుందన్నారు. జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో గిరిజన, ఇతరులు అటవీ భూప్రాంతంలో పొడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. పేదవారికి న్యాయం చేస్తూ, అడవినీ, పుడమిని కాపాడుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. నవంబర్ 8 నుండి గ్రామ గ్రామాన సదస్సులు నిర్వహించి, పోడు భూములు ఆక్రమణలో ఉన్నవారి నుండి అర్జీలు స్వీకరించి, అర్హత గల వాటిని పరిశీలించి, క్షేత్ర స్థాయిలో వాస్తవికత పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం పిమ్మట భవిష్యత్తులో తిరిగి అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలు, జిల్లా స్థాయిలో అటవీ సంరక్షణ కమిటీలు ఏర్పాటుచేయాలన్నారు. అన్ని పక్షాల భాగస్వామ్యంతో పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. 33 శాతం అటవీ ప్రాంతంతో వాతావరణ సమతుల్యత ఉంటుందని, అటవీ సంపద సంరక్షణ మన అందరి ప్రాధమిక కర్తవ్యమని మంత్రి అన్నారు. అడవులు క్షీణిస్తూ ఉండడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని అతివృష్టి, అనావృష్టి, కాలం లేకుండా వర్షాలతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. పార్టీలకతీతంగా అన్ని పక్షాల సమ్మతితో ముందుకు వెళ్లాలన్నారు. అటవీ, రెవిన్యూ భూ సమస్యలు ఉన్నచోట రెండు శాఖల జాయింట్ సర్వే చేపట్టి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్వోఎఫ్ ఆర్ చట్టం తెచ్చి గిరిజనులకు హక్కులు కల్పించిందని, గిరిజనేతరుల విషయంలో కేంద్ర చట్టం అడ్డంకిగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి అఖిలపక్షంతో కేంద్రం దృష్టికి తీసుకెళతామని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ధరణి ప్రవేశపెట్టి, విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన తెలిపారు. త్వరలో డిజిటల్ సర్వే చేపట్టనున్నట్లు, డిజిటల్ సర్వే తో ఆక్షాoశాలు, రేఖాoశాలతో భూముల విషయంలో ఖచ్చితత్వం వస్తుందని ఆయన అన్నారు. పోడు సమస్యలు ఉన్న 67 గ్రామాల్లో సదస్సుల నిర్వహణ అనంతరం సేకరించిన డాటాతో తిరిగి అఖిలపక్ష సమావేశం నిర్వహించి పారదర్శకంగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పేదవారికి జీవనోపాధి, భవిష్యత్తు తరాలకు అడవి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు.
సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ, దశాబ్దాలుగా పోడు భూముల సమస్య పరిష్కారం కాకుండా ఉందన్నారు. జిల్లాలో ఇంకా 10 శాతం అటవీ సంపద పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అడవులను కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. పోడు భూముల శాశ్వత పరిష్కారంతో పాటు అడవినీ, పేద రైతుల హక్కులను కాపాడుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తు స్క్రూటిని చేసి, పారదర్శకంగా పరిష్కారం చూపాలన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, పోడు భూముల సమస్య పరిష్కారం చూపుతూ, అర్హులకు పట్టాలిచ్చి, మిగిలిన అడవినీ కాపాడుకొనే చర్యలు చేపట్టాలన్నారు. అటవీ ప్రాంతం ఏమాత్రం ఆక్రమణ కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన, గిరిజనేతరుల అర్జీలు స్వీకరిస్తామన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ కార్యదర్శి, విఆర్ఏ, అటవీ బీట్ అధికారి, మండల సర్వేయర్ లతో కూడిన బృందం సోమవారం నుండి అర్జీలు ఏ ఫారంలో, ఎలా సమర్పించాలి అనే విషయంలో అర్జీదారులకు అవగాహన చేస్తారన్నారు. గ్రామసభ ద్వారా అర్జీలు స్వీకరించనున్నట్లు ఆయన అన్నారు. 8 మండలాల పరిధిలోని 67 గ్రామాల్లో అటవీ హక్కు కమిటీలు ఏర్పాటుచేసినట్లు, ప్రతి అర్జీని పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో తమ పరిధిలో గల అటవీ భూముల్లో ఇకముందు ఎలాంటి అన్యాక్రాంతం, ఆక్రమణలు జరగనియ్యమని, ఇప్పటి వరకు అటవీ భూముల్లో ఉన్న అర్హులైన వారికి హక్కులు కల్పించిన పిమ్మట ఎటువంటి ఆక్రమణలు అనుమతించబోమని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ ఎన్.అరుణ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా అటవీ అధికారిణి బాలామణి, ఇంచార్జ్ రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీపీఓ రవీందర్, డీటీడీఓ గంగారాం, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.