పోడు భూముల సర్వే పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేసి గ్రామసభలు నిర్వహిచాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
శుక్రవారం బి.ఆర్.కె భవన్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ, పోలీస్ శాఖ అధికారులు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూముల సర్వే అధికార యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్ మొదటి వారంలో పోడు భూముల లబ్దిదారులకు యాజమాన్య హక్కు పత్రాలను మెహబూబాబాద్ జిల్లాలో పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతకుముందే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోడు భూముల సర్వే పూర్తిచేసి గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. ఏమైన సమస్యలు ఉత్పన్నమైనపుడు రాష్ట్ర అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి దరఖాస్తుదారుని భూములను పరిశీలించి సర్వే చేపట్టాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ పోడు భూముల సర్వే వేగవంతం చేసి ఈ నెల 20 నాటికి పూర్తిచేసి యాప్ లో అప్లోడ్ చేయాలని, కావలసిన అదనపు సిబ్బందిని సమకూర్చుకోవాలని, సమస్యలను సున్నితంగా పరిష్కరించాలని సూచించారు.
తల్లిదండ్రుల బాగోగులు చూడడం జరగాలని, జిల్లాస్థాయిలో తల్లిదండ్రుల పోషణకు సంబందించిన అర్జీలను ఆర్డీఓ నిర్ణీత సమయంలో చట్టప్రకారం పరిష్కరించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నెల ఈ అంశంపై సమీక్షించాలని అన్నారు. వృద్ధుల సంరక్షణ వారి పిల్లలపై ఉంటుందని, ఈ చట్టంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. స్త్రీ శిశు సంక్షేమం, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంరక్షణ బాధ్యత వారి పిల్లలపై ఉంటుందని, వారి సంరక్షణ బాధ్యత చూడడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. జిల్లాల్లో ఆర్డీఓ నేతృత్వంలో సమస్యలను పరిష్కరించాలని, కలెక్టర్లు వయోవృద్ధుల సంక్షేమానికి, వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సర్వే పనులను వేగవంతం చేసి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని, గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపారు. సర్వే చేసిన వివరాలను ఎప్పటికప్పుడు యాప్ లో పొందుపరుస్తున్నామని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, ఆర్డీఓలు వెంకటాచారి, రాజేశ్వరి, చంద్రకళ, వేణుగోపాల్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.