పోడు భూముల హక్కులకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేసే విధంగా సన్నద్ధం కావాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పోడు భూముల హక్కులకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేసే విధంగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖ, పి.ఓ. ఐ.టి.డి.ఏ, రెవిన్యూ, సంబంధిత ఎంపిడిఓ లతో పోడు భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 14 మండలాలకు సంబంధించి 93 గ్రామ పంచాయతిలలోని 138 హాబీటేషన్ల నుండి 11251 దరఖాస్తు లు రావడం జరిగిందని, వీటిలో 5333 మంది ఎస్టీ లు 18,413.30 ఎకరాల భూమి పై హక్కులు కోరుతూ దరఖాస్తులు వచ్చాయని కాగా 5918 ఇతర వర్గాల వారు 18843.65 ఏకరాలకు దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా అర్హులు దరఖాస్తులు చేసుకోలేక ఉండిపోయారేమో క్షేత్ర స్థాయిలో చూసుకోవాల్సిందిగా సంబంధిత డివిజినల్ పంచాయతీ అధికారులకు ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన, సర్వే చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కమిటీ సభ్యులకు ఏ విధంగా సర్వే చేయాలి అని విషయం పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి కమిటీలో ఒక అటవీ శాఖ సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ, డి.ఆర్.డి.ఓ సిబ్బంది ఉంటారని తెలిపారు. వచ్చిన దరఖాస్తులన్నింటిని ఆన్లైన్లో నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో దరఖాస్తు దారుడు ఎంత భూమికి దరఖాస్తు చేసుకున్నారు, ఏ సర్వే నెంబరులో ఎక్కడ ఉంది అనే వివరాలు సర్వే చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది, సర్వేయర్లు కలసి తమ వద్ద ఉన్న మొబాయిల్ యాప్, జి.పి.ఎస్ సిస్టమ్ లను ఉపయోగించి సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. దీనికొఱకు ఇరువురు శాఖల సిబ్బంది తమ తమ నైపుణ్యాన్ని ఒకరినొకరు పంచుకొని పకడ్బందీగా సర్వే చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇంతకు ముందు వచ్చిన దరఖాస్తులకు హక్కు పత్రాలు ఇవ్వకుండా మిగిలిపోయిన వాటిని ఎలా పరిష్కరించాలో సమావేశంలో చర్చించారు. గిరిజనేతరులకు 75 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నట్లు నిరూపించే ఎల్డర్స్ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుందని ఎల్డర్స్ సర్టిఫికెట్ ఎలా ఎక్కడ తీసుకోవాలి అనేది అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అటవీలో నివాసం ఉంటూ అక్కడి నుండి బయటికి వచ్చేందుకు ఇష్టపడని చెంచు పెంటల ప్రజలకు అటవీ ప్రాంతానికి నష్టం కలుగకుండా వారికి కనీస సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఐ.టి.డి.ఏ ద్వారా చెంచు పెంటల అభివృద్ధికి అనేక పథకాలు, నిధులు ఉన్నప్పటికీ ని అటవీ శాఖ నుండి అనుమతులు రాక నిధులు వృధా అవుతున్నాయని, అదేవిధంగా అటవీ శాఖ ద్వారా చెంచుల అభివృద్ధికై కేటాయిస్తున్న నిధులు సైతం పూర్తిగా ఉపయోగించుకోవడం లేదన్నారు. అందువల్ల వారికి కనీస మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే దానిపై అటవీ శాఖ, పి.ఓ.ఐ.టి.డి.ఏ అధికారులు కూర్చొని సమన్వయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరు శాఖల అధికారులను సూచించారు. తాగునీరు, సౌర విద్యుత్తు, ఆరోగ్యం, వర్షపు నీరు కురువని నివాసం, విద్య వంటి మౌళిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందన్నారు. వీటి ఏర్పాటు కై ఇటు అడవికి గాని జంతువులకు ఇబ్బందులు కలుగకుండా వారికి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ఇరు శాఖల అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, పి.ఓ.ఐ.టి.డి.ఏ అశోక్, ఎఫ్.డి.ఓ. రోహిత్ రెడ్డి, నవీన్ రెడ్డి, అచ్ఛంపేట ఆర్డీఓ పాండు నాయక్, డి.పి.ఓ కృష్ణ, ఫారెస్ట్ అధికారులు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post