పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 26: వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 126 వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్ లో ఘనంగా వేడుకలు జరిగాయి. వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను గుర్తించి జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర పండుగగా, అధికారికంగా జరపాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. వీరనారి వరంగల్ జిల్లా రాయపర్తి లో జన్మించి, మన జిల్లా పాలకుర్తిలో స్థిరపడ్డారన్నారు. అదృష్టవశాత్తు వారి వారసులు మన జిల్లాలోనే ఉన్నారన్నారు. తెలంగాణ విముక్తికి, వెట్టిచాకిరి, జమీందారులకు వ్యతిరేకంగా ఆమె పోరాడారన్నారు. తెలంగాణా పోరాటంలో తనదైన ముద్ర వేశారన్నారు. సమాజం కోసం వీరనారి చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ అన్నారు.
వేడుకల్లో వీరనారి చాకలి ఐలమ్మ మునిమనుమడు చిట్యాల సంపత్, మునిమనమరాలు చిట్యాల స్వప్న ను జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి, మెమోంటోలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, జనగామ ఆర్డీవో మధు మోహన్, జిల్లా బిసి సంక్షేమ అధికారి డి. శ్రీనివాస రెడ్డి, జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణా రెడ్డి, పాలకుర్తి ఎంపిపి నల్లా నాగిరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రజక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post