పోషణలోపం లేని చిన్నారులను తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి అంగన్వాడీ సిబ్బందిపై ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్ నుండి పోషణలోపం ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సిడిపిఓలు, సూపర్వైజర్లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం వారిగా తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారుల జాబితాను తయారు చేయాలని చెప్పారు. అంగన్వాడీలో ఉన్న ప్రతి పిల్లవాడు పోషణలోపం లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని చెప్పారు. గర్భం ధరించిన నాటి నుండి మొదటి వెయ్యి రోజులు అత్యంత ముఖ్యమైనవని, మానసిక, శారీరక ఎదుగుదలకు మొదటి వెయ్యిరోజుల్లో చిన్నారులకు వచ్చే సమస్య ప్రతి తల్లికి తెలియ చేయాలని చెప్పారు. ఈ వెయ్యి రోజుల్లో చిన్నారులకు సరైన పోషణ అందకపోతే తరువాత జీవితంలో ఎటువంటి ఆహారం ఇచ్చినా, ఎంత గొప్ప చదువులు చెప్పించినా ఉపయోగం ఉండదని, జీవితాంతం వాళ్లు దివ్యాంగులుగా బ్రతకడానికి మనమే కారణమవుతామని చెప్పారు. మన జిల్లాలో ఈ పోషణ సమస్య ఎక్కువగా ఉన్నదని, తీవ్ర, అతి తీవ్రపోషణ లోపంతో భాదపడుతున్న చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయుటకు కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు. ఇంటింటి సర్వేలో 72402 మంది చిన్నారులున్నట్లు గుర్తించి వారిలో పోషణలోపంతో ఉన్న చిన్నారులను కూడా గుర్తించడం జరిగిందని చెప్పారు. పోషణలోపం ఉన్న చిన్నారులు ఎంతమంది ఉన్నారో సమగ్ర సమాచారం సిబ్బందికి తెలిసి ఉండాలని చెప్పారు. లోపం ఉన్న చిన్నారుల జాబితాను పోషణ ట్రాకర్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి బుధవారం తు.చ. తప్పకుండా చిన్నారుల తల్లులతో సమావేశం నిర్వహించి కుపోషణ మీద వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. తల్లులకు అవగాహన లేమి వల్ల పిల్లల ఎదుగుదలకు సమతుల్యమైన ఆహారం అందడం. లేదని, ఇంటిలో కూడా చిన్నారులకు పోషణ ఆహారం అందించే విధంగా తల్లులకు అవగాహన కల్పించడం ద్వారా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. పోషణలోపం వల్ల రోగనిరోదక సమస్య వస్తుందని తల్లులకు తెలియచేయడంతో పాటు చిన్నారులకు సమతుల్యమైన ఆహారం ఇచ్చేందుకు అవగాహన చాలా ముఖ్యమని చెప్పారు. కుపోషణ నివారణకు చిన్నారులకు ఏవిధమైన. ఆహారం ఇస్తే బావుంటదని, తల్లి ఆరాటపడుతుందని, అవగాహన లేమి వల్ల అది సాధ్యపడుట లేదని చెప్పారు. పోషణలోపం ఉన్న. చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుటకు సిడిపిఓలు, సూపర్వైజర్లు నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రంలో తప్పకుండా చిన్నారుల తల్లులతో, సర్పంచులతో నిర్వహించిన సమావేశపు ఫోటోలు తనకు పంపాలని సంక్షేమ అధికారికి సూచించారు. పోషణ సమస్య జీరో అయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా జరుతూ ఉండాలని చెప్పారు. తన క్షేత్రస్థాయి పర్యటనల్లో తల్లులతో ముఖాముఖి నిర్వహిస్తానని, సమావేశాలు నిర్వహించలేదని చెప్తే కఠిన చర్యలు: తీసుకుంటానని హెచ్చరించారు. పంచాయతీలో కు పోషణ లేని చిన్నారులను తయారు చేయుటకు సర్పంచ్లను భాగస్వాములను చేయాలని చెప్పారు. పోషణలోపం లేని పంచాయతీలను ప్రకటించాలని, ఆ విధంగా చేస్తే తప్పకుండా మన పోషణలోపం లేని జిల్లాగా తయారవుతుందని చెప్పారు. ప్రతి బుధవారం పోషణలోపం ఉన్న చిన్నారులను పరిశీలించి పెరుగుదలను పరిశీలించాలని ఎంత మంది చిన్నారులు ఈ సమస్య నుండి ఆరోగ్యవంతంగా తయారయ్యారో పూర్తి వివరాలు ఉండాలని చెప్పారు. ఇలా నిరంతరాయంగా పర్యవేక్షణ చేయడం వల్ల చిన్నారులు కు పోషణ నుండి సురక్షితంగా బయటికి తీసుకురావొచ్చని చెప్పారు. ఇంకా లోపం ఉంటే న్యూట్రిషన్ కేంద్రాలను పంపి వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. రానున్న మూడు నెలల్లో పోషణలోపం లేని చిన్నారులను తయారు చేసి మన జిల్లాను ఆదర్శంగా నిలపాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు నిధులు కేటాయింపు చేశామని, అలాగే మొదటిదశలో ఎంపిక చేసిన వంద అంగన్వాడీలకు క్రీడా సామాగ్రి మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అంగన్వాడీ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించి మన జిల్లాలో పోషణ లోపం లేని చిన్నారులను తయారు చేయాలని చెప్పారు. ఉత్తమ సేవలందించిన సిడిపిఓలకు, సూపర్వైజర్లుకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు జారీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, అన్ని ప్రాజెక్టుల సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post