పోషణ్ అభియాన్ లో భాగంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన
తేది 21-3-2023
నాగర్ కర్నూల్ జిల్లా
పోషణ్ అభియాన్ లో భాగంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలి
మార్చి, 20 నుండి ఏప్రిల్ 3 వరకు నాగర్ కర్నూల్ జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమం
ఈసారి పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ఆరోగ్యానికి చిరుధాన్యాల వినియోగం – వాటి లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్
మార్చి 20 నుండి ఏప్రిల్ 3 వరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు లైన్ డిపార్ట్మెంట్ లు అయిన వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యా తదితర శాఖలు సమన్వయం తో పని చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్త హీనత ఇతర జబ్బులను అరికట్టడానికి పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్కో శాఖకు లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ పక్షం రోజుల పోషణ్ అభియాన్ లో ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బరువు, కొలతలు తీసి రిజిష్టరులో నమోదు చేసి ఆన్లైన్ చెయ్యాలని ఇందులో అంగన్వాడీ సూపర్ వైజర్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఈ కొలతలు, ప్రమాణాలనే నిర్దిష్ట ప్రమాణాలుగా భావిస్తామని తెలియజేశారు. ఇప్పటి వరకు ఏ పిల్లవాడికి ఏ ఏ టీకాలు ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిపోయిన టీకాలు ఇంటివి అనే వివరాలను పకడ్బందీగా గుర్తించి రిజిష్టరులో నమోదు చేయాలని సూచించారు. నట్టాల నివారణ మందుల పై విస్తృతంగా ప్రచారం, అవగాహన కార్యక్రమం చేపట్టాలి. పిల్లలు, గర్భిణీలకు పౌష్టికారం పై అవగాహన కల్పించడం. 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లల కు టెక్ హోమ్ రేషన్ వివరాలు అప్డేట్ చేయడం వంటి కార్యక్రమాలను లక్ష్యంగా పెట్టుకొని వందశాతం ఖచ్చితత్వం తో పూర్తి చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణకు హరితహారం లో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో, ప్రతి పాఠశాల, కళాశాల, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటుకు కావాల్సిన మట్టి, మొక్కలు ఇతర సదుపాయాలు కల్పించే బాధ్యతను పంచాయతీరాజ్ శాఖకు అప్పగిస్తూ డి.పి.ఓ కు తగు ఆదేశాలు జారీ చేశారు. చేతిని శుభ్రంగా కడుక్కునే నైపుణ్య శిక్షణ, పారిశుధ్యం, పౌష్టికాహారం, బాల్య వివాహాల నిర్ములన, మహిళలకు ఉపాధి అవకాశాలు వంటి కార్యక్రమాల పై స్వయం సహాయక సంఘాల మహిళలకు, గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించే బాధ్యలు అప్పగించారు.
కౌమార దశ అమ్మాయిలు, గర్భిణీలకు రక్త పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ శాతం నివేదికను రూపొందించే బాధ్యతను జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యా శాఖ, వసతి గృహాలు వార్డెన్లు, ప్రిన్సిపాల్ లపై ఉందని తెలియజేసారు. జిల్లాలో ఎంతమంది రక్త హీనతతో బాధపడుతున్నారో ఖచ్చితమైన నివేదిక రూపొందించాల్సిందిగా ఆదేశించారు.
ప్రతి అంగన్వాడీ కేంద్రం, ప్రతి పాఠశాల, కళాశాల, గురుకుల పాఠశాలలో తాగు నీటి కుళాయి సౌకర్యం ఉందా లేదా నివేదిక తయారు చేసి ఇంకా ఎక్కడైన మిషన్ భగీరథ తాగు నీటి కుళాయి లేని చోట ఏర్పాటు చేసే బాధ్యతను గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు బాధ్యత అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ పక్షం రోజులు గ్రామాల్లో అంగన్వాడీ ల ద్వారా ఏర్పాటు చేసే పౌష్టికాహార పదార్థాల ప్రదర్శనకు కావాల్సిన ధాన్యాలు అందించాల్సిన బాధ్యతను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖకు అప్పగించారు. న్యూట్రీ గార్డెన్ కు అవసరమైన నాణ్యమైన విత్తనాలు అందించాల్సిందిగా పాలెం వ్యవసాయ పరిశోధన అధికారులకు అప్పగించారు.
మున్సిపాలిటీ, మండలాలు, ప్రతి గ్రామంలో పౌష్టికాహారం, చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం పై విస్తృతంగా ప్రచారం, అవగాహన కల్పించాలని ఇందులో లైన్ డిపార్ట్మెంట్ లు అందరూ తమవంతు బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.
అనంతరం పోషణ్ పక్వాడా గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి వెంకటలక్ష్మి, డి.పి.ఓ కృష్ణ, బి.సి. సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఇమ్యునైజేషన్ అధికారి రవి నాయక్, మిషన్ భగీరథ ఈ.ఈ శ్రీధర్, డిప్యూటీ సి.ఈ.ఓ భాగ్యలక్ష్మి, సఖి సెంటర్ అధికారిణి సునీత, డి.సి.పి.ఓ నిరంజన్, సి.డి.పి.ఓ లు, అంగన్వాడీ సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.
—————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ

Share This Post