పోషణ అభియాన్ కార్యక్రమాలు నిర్వహణ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టిక లోపాలను గుర్తించి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టేందుకు  ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

గురువారం రామవరంలోని సత్యసాయి కమ్యూనిటీ హాలు నందు మహిళా శిశు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసోత్సవాల్లో భాగంగా సీమంతాలు, చిన్నారులకు అక్షర అభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిధిగా విచ్చేసి సీమంతం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించే కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పౌష్టిక లోపంతో భాదపడుతున్న గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను గుర్తించి బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు 2022 ను లక్ష్యంగా నిర్దేశించుకుని  తల్లి, పిల్లలు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గర్భిణులకు వేయి రోజులు చాలా ముఖ్యమని ఈ రోజుల్లో పౌష్టికాహారం లోపం ఉన్నట్లుయితే చిన్నారులు అనారోగ్యంతో జన్మించే అవకాశంతో పాటు తల్లులు కూడా పౌష్టికాహారం లోపంతో అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. గర్బితి అయిన, బాలింతైన మహిళలతో పాటు చిన్నారులు మంచి పౌరులుగా ఎదిగేందుకు చాలా అవసరమని చెప్పారు. సరైన పౌష్టికాహారం అందకపోవడం వల్ల తల్లి, బిడ్డ ఎదుగుదల ఆశించిన స్థాయిలో ఉండదని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంచి విటమిన్లు కలిగిన ఆహారం అందించడం వల్ల పౌష్టికాహార లోపాన్ని ముందుగానే గుర్తించి తల్లి పిల్లలు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. అన్నం కూరల్లో సరైన పోషకాలు అందే అవకాశం లేకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో సమతుల్యమైన ఆహారాన్ని అందించేందుకు విటమిన్లు కలిగిన ఆహారం పాటు కూరగాయలు, పాలు, గుడ్లు అందిస్తున్నామని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో అంగన్వాడీ, వైద్య సిబ్బంది సేవలు ఎంతో అభినందనీయమని వీరి సేవలను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యవంతమైన నవసమాజ నిర్మాణంలో భాగంగా గర్భిణిలు, బాలింతలు, చిన్నారులను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుటలో అంగన్వాడీ, వైద్య సిబ్బంది సలహాలు, సూచనలు తప్పక పాటించాలని ఆయన స్పష్టం  చేశారు. చిన్నారుల ఎదుగుదలకు అంగన్వాడీ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారని, వీళ్లే మన సైనికులని అభివర్ణించారు. వైద్య, అంగన్వాడీ సిబ్బంది ద్వారా మాత్రమే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్తూ సర్వే ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు పౌష్టికలోపంతో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. పౌష్టికాహారలోపం ఉన్న చిన్నారులకు రిపోర్టు కార్డులు జారీ చేస్తున్నామని ప్రతి నెలా పరీక్షలో పురోగతిని నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. చిన్నారుల ఆరోగ్య విషయాలను తల్లిదండ్రులు తెలుసుకోవడానికి రిపోర్టు కార్డులు చాలా ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. తల్లి, పిల్లల ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యమని, ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం ఈ పోషణ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేసి ఆరోగ్యవంతమైన సమ సమాజ ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పారు. చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీ సిబ్బంది యొక్క పాత్ర చాలా ముఖ్యమని మీ సేవలు అభినందనీయమని చెప్పారు. కరోనా వ్యాధి నియంత్రణ చేయుటకు కేంద్రాలు నిర్వహణకు అవకాశం లేకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి పౌష్టికాహారాన్ని అందించారని ఈ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. చిట్టిరామవరంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు అందచేయాలని సంక్షేమ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, సిడిపిఓ షబానా, తహసిల్దార్ రామక్రిష్ణ, రామవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సంజీవరావు, కౌన్సిలర్లు విజయలక్ష్మి, రూప, జమలయ్య, పద్మ, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post