ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబర్15:
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం పట్టణములోని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ సెంటర్లో చేస్తున్న వైద్య పరిక్షల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ లో అందుతున్న ఉచిత సేవల గురించి ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయాలని, ప్రజలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కేంద్రంలో సిబ్బంది సమయపాలన పాటించాలని, చేసిన వైద్య పరీక్షల నివేదికలు ప్రజలకు త్వరితగతిన అందించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసారు. ప్రతి వార్డు తిరుగుతూ రోగులను పలకరించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో భోజనశాల, ఫార్మసీ, ఓపి గదులు, ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ ఓపి, రిసెప్షన్ ల్యాబ్ ఆరోగ్య శ్రీ వార్డులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పిమ్మట అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టేక్నిషియన్స్ ఇతర సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. డాక్టర్లు వారికి సంబంధించిన విభాగాల్లో అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. రోగులకు మెనూ ప్రకారం ఆహారం, పాలు, గ్రుడ్డ్లు, చపాతి, పండ్లు అందించాలని అన్నారు. ఆసుపత్రి ఆవరణ, ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో నిరంతరం మూడు దఫాలుగా సెక్యురిటీ, శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి సమాచారం కోసం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలన్నారు. విభాగాల వారిగా సిబ్బంది హాజరు వివరములకు బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలన్నారు. వెంటనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పించే అత్యుత్తమ వైద్య సేవలు సామాన్య ప్రజలకు నిత్యం అందేలా వైద్య సిబ్బంది పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా వైద్యాధికారి డా. ఏ. మహేందర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. సుగుణాకర్ రాజు, డిఆర్డీఓ జి. రాంరెడ్డి, జిల్లా ఉప వైద్యాధికారిణి డా. కరుణశ్రీ, ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post