ప్రజలు ఋణమేళాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సిరిసిల్ల, 29 అక్టోబర్, 2021
బ్యాంకర్లు నిర్వహించే ఋణమేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు.

శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణమండపంలో నిర్వహించిన ఋణ విస్తరణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను స్వయంగా సందర్శించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఋణాల కొరకు బ్యాంకులను ఆశ్రయించాలని, సాంఘీక సంక్షేమ పథకాలు అయిన పీఎం సురక్ష భీమా యోజన, పీఎం జీవనజ్యోతి యోజన, తదితర వాటి గురించి తెలుసుకుని లబ్ది పొందాలని సూచించారు.
దేశాభివృద్ధిలో బ్యాంకుల యొక్క పాత్ర కీలకమని అన్నారు. వ్యవసాయ, గృహ, వాహన అలాగే పరిశ్రమల స్థాపనకు కావాల్సిన లోన్లను బ్యాంకుల నుండి అందిపుచ్చుకోవాలని కోరారు.
సమగ్ర ఋణ విస్తరణ కింద జిల్లాలోని మహిళా సంఘాలకు 132 కోట్ల 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. అందులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారు 70 కోట్ల 98 లక్షలు, యూనియన్ బ్యాంకు వారు 29 కోట్ల 56 లక్షలు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 20 కోట్ల 53 లక్షలు, కేడీసీసీ బ్యాంకు 11 కోట్ల 20 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

ఆకట్టుకున్న బుర్రకథ

బ్యాంకులు అందిస్తున్న ఋణాల గురించి, ఫేక్ మెసేజ్ లకు, ఫేక్ కాల్స్ కు స్పందించి తమ వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ వివరాలను ఇతరులకు చెప్పి ప్రస్తుతం ఎంతో మంది మోసపోతున్నారని, ఆ విషయంపై అవగాహన కల్పించేందుకు ముగ్గురు బుర్రకథ కళాకారులు చెప్పిన కథ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారిని అందరూ అభినందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం.అరుణ్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం రవీంద్ర బాబురావు గురావ్, డీఆర్డీఓ పీడీ కె.కౌటిల్య, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ జి.రంగారెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ బి.గంగాధర్, కేడీసీసీ బ్యాంకు సీఈఓ సత్యనారాయణ, నాబార్డ్ డీడీఎం మనోహర్ రెడ్డి, ప్రభుత్వ, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, రాజన్న సిరిసిల్లచే జారిచేయనైనది.

Share This Post