ప్రజలు నివసించు ప్రాంతాల్లో  పందుల నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లుతో పారిశుద్ధ్యం, పట్టణాల్లో పందుల నియంత్రణ చర్యలు, సదరం క్యాంపులు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనావాసాల మధ్య పందుల పెంపకంతో వాటి ద్వారా  ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని, అందువల్ల పందుల పెంచుతున్న యజమానులతో సమావేశం నిర్వహించి జనావాసాలకు దూరంగా పందుల పెంపకం చేపట్టు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పందుల యజమానులతో సమావేశం నిర్వహణ తదుపరి ఇచ్చిన తేదీలోగా పందులను జనావాసాలకు దూరంగా తరలించకపోతే జాప్యం చేయక పందుల ఏరివేత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన దివ్యాంగులు పించను పొందేందుకు సదరం క్యాంపులు నిర్వహణకు షెడ్యూలు తయారు చేయాలని డిఆర్డిఓకు సూచించారు. సదరం క్యాంపులు నిర్వహణ షెడ్యూలు ప్రకారం దివ్యాంగులు క్యాంపులకు హాజరై ధృవీకరణ పత్రాలు పొందాలని ఆయన సూచించారు. కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో వర్షపునీటితో ఇండ్లు  మునుగుతున్న సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మత్తులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 1 వ తేదీ నుండి  15 వ తేదీ వరకు  నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో గ్రామాలు, పట్టణాల్లో పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించాలని చెప్పారు. అంటువ్యాధుల నియంత్రణలో భాగంగా మురుగునీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. దోమలు వ్యాప్తి జరుగకుండా ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post