ప్రజల ఆకాంక్షల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ రోడ్ల వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 21 ఖమ్మం:

ప్రజల ఆకాంక్షల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ రోడ్ల వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భారత్ కి ఆజాదికఅమృత్ మహోత్సవ సందర్భంగా ఈ నెల 15 నుండి 22 వరకు నిర్వహిస్తున్న గ్రామీణ రోడ్ల వారోత్సవాలలో భాగంగా శనివారం ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనపై నిర్వహించిన సెమినార్కు మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని తమ సందేశానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలానికనుగుణంగా అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంజనీరింగ్ అధికారులు అందిపుచ్చుకోవాలని, నూతన టెక్నాలజీ అవలంభించడం ద్వారా తక్కువ ఖర్చుతో మన్నిక గల రోడ్ల పనులు చేపట్టవచ్చని మంత్రి తెలిపారు. రఘునాథపాలెం మండలంలో జి.ఎస్.బి టెక్నాలజీ ద్వారా కేవలం 2 కోట్ల వ్యవయంతో 426 రోడ్డు పనులు చేపట్టి అభివృద్ధి పర్చుకున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మన జిల్లాలో గ్రామీణ రోడ్లు వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయని, గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పి.ఎం.జి.ఎస్.వై పథకం పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని నియోజకవర్గానికి కేవలం 25 కి.మీ మేర రోడ్ల చొప్పున ఈ సంవత్సరం ఏ. ఎం. జి.ఎస్.వై కింద జిల్లాలో 115 కి.మీ రోడ్లను మాత్రమే మన జిల్లాకు కేటాయించిందని మంత్రి అన్నారు. జిల్లాలో పి.ఎం.జి.ఎస్. వై-3 వ దశ కింద 93.44 కోట్లతో 16 రోడ్లు, 3 వంతెనల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, రోడ్ల వ్యవస్థ అభివృద్ధి ద్వారానే రవాణా సౌకర్యాలు మెరుగుపడి గ్రామాలు మరింత అభివృద్ధి. చెందుతాయని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ రోడ్ల వ్యవస్థ బాగుంటేనే రైతుల ఉత్పత్తుల రవాణాకు అనుకూలంగా ఉంటుందని, మారుతున్న కాలానికనుగుణంగా నూతన సాంకేతిక విధానాల పట్ల ఇంజనీరింగ్ అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించడం ద్వారా గ్రామీణ రోడ్ల అభివృద్ధిలో నాణ్యమైన, దీర్ఘకాలిక ప్రయోజనం కలిగిన పనులు చేపట్టవచ్చని తద్వారా తక్కువ వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు ఉండవని పార్లమెంట్ సభ్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా ఎన్నడూ లేనివిధంగా గ్రామాల అభివృద్ధి గణనీయంగా జరిగిందని ఇట్టి గ్రామలలో రోడ్ల అభివృద్ధికి పి. ఎం.జి. ఎస్.వై కింద మంజూరైన పనులను చేపడ్తూ, రాబోయో ప్రతిపాదనలను కూడా సకాలంలో సిద్ధం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథక కింద గ్రామీణ రోడ్ల అభివృద్ధిలో మన జిల్లాను అగ్రగామిగా నిలపాలని పార్లమెంట్ సభ్యులు కోరారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ గ్రామీణ రోడ్లు అభివృద్ధికి సూచికలుగా నిలుస్తాయని, పి.ఎం.జి.ఎస్.వై రోడ్ల అభివృద్ధికి గాను ఆధునిక టెక్నాలజీ అమలు చేసేందుకు నిర్వహిస్తున్న సెమినార్ను ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా సద్వినియోగపర్చుకొని సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన గత ఏడు సంవత్సరకాలంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని జిల్లాలో జరుగుతున్న గ్రామీణ రోడ్ల అభివృద్ధి పనులలో నూతన సాంకేతిక విధానంతో పనులు జరగాలని ఆయన అన్నారు.

శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, పంచాయితీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు జి.సీతారాం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు జి.వి. చంద్రమౌళి, డి. శ్రీనివాసరావు, జిల్లాలోని పంచాయితీరాజ్ డి ఇలు, ఏ.ఇలు, కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యులు, వర్క్ ఇన్స్ పెక్టర్లు తదితరులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post