ప్రజల గొంతుకగా జీవితాంతం బ్రతికిన కాళోజి నారాయణ రావు చిరస్మరనీయులు:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రజల గొంతుకగా జీవితాంతం బ్రతికిన కాళోజి నారాయణ రావు చిరస్మరనీయులు:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 9: ప్రజల గొంతుకగా జీవితాంతం బ్రతికిన కాళోజి నారాయణరావు చిరస్మరనీయులని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి నారాయణరావు 107 వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని మనిషి ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన మానవతావాది కాళోజి అని అన్నారు. ప్రజల్లో చైతన్య దీప్తిని వెలిగించడానికి కాళోజి ధైర్యంగా పోరాడారన్నారు. ప్రజలను చైతన్యపరిచే విధంగా కాళోజీ అనేక రచనలు చేసారని, తెలంగాణ భాష యాసను వ్యాప్తి చెందే విధంగా ఆయన రచనలు ఉండేవని కలెక్టర్ గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం ఉద్యమం చేసిన ఉద్యమకారుడు కాళోజీ అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కాళోజీ రచనలు ఎంతో దోహదపడ్డాయని, ఆయన స్పూర్తితో ఆయన జన్మదినం నాడు తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ లో ఏర్పాటు చేసిన వైద్య విశ్వవిద్యాలయానికి సైతం కాళోజీ పేరు పెట్టి ఆయనను గౌరవించడం జరిగిందని అన్నారు. కాళోజిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, కలెక్టరేట్ ఏవో మురళీధర్ రావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మన్సూర్ ఆలి, మహ్మద్ సలీం, మహ్మద్ ఏతేషాం అలీ, స్వాతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post