ప్రజల సంక్షేమాభివృద్ధి దిశగా ప్రభుత్వ చర్యలు : రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇందక్రరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌ నేత, జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో 21 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రేకులషెద్దును ప్రారంభించి దైవ దర్శనం చేసుకున్నారు. కాలేజీరోడ్దులో మహిళల అభివృద్ధి, సాధికారత కోసం 48 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సఖి కేంద్రంను ప్రారంభించిన అనంతరం మంత్రి వర్యులు మాట్లాడుతూ ఏప్రిల్‌ 1, 2019న ప్రారంభించిన సఖి కేంద్రంకు ఇప్పటి వరకు 703 కేసులు రాగా 594 పరిష్కరించారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గృహహింస, వరకట్నం, లైంగిక వేధింపుల బాధితులకు కౌన్సిలింగ్‌ చేయడంతో పాటు సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని, మహిళలకు రక్షణ తదితర అంశాలపై సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నంబర్‌ 181 ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా తక్షణమే స్పందించి సత్వర న్యాయం జరిగే విధంగా సఖి కేంద్రాలు పని చేస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల పట్ల జరుగుచున్న అన్యాయాలు, వారి పని చేసే ప్రదేశాలలో బాధితులకు సఖి కేంద్రం ద్వారా తగు రక్షణ కల్పించడం జరుగుతుందని, సఖి కేంద్రం అనగా స్నేహితులుగా భావించి బాధిత మహిళలకు కౌన్సిలింగ్‌తో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, రెవెన్యూ, పోలీసు, మహిళా-శిశు సంక్షేమం, డ్రీమ్స్‌ సొసైటీ ద్వారా రక్షణ కల్పించడం జరుగుతుందని, జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న మహిళలకు సఖి కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలపై అవగాహన కల్పిస్తుందని, సమాజంలో అందరు కలిసి పని చేయాలని అన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెండు వార్డులతో పాటు చిన్నపిల్లల కరోనా ఐసోలేషన్‌ వార్డును ప్రారంభించి, ఐ.బి. చౌరస్తాలోని రోడ్డు-భవనాల శాఖ అతిథి గృహం వద్ద 2 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో 7 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ సమీకృత మార్కెట్‌ ద్వారా అన్ని సదుపాయాలు లభిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో ఈ మార్కెట్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు ఆర్థికంగా బలపడేందుకు పంట మార్చిడి విధానాన్ని కొనసాగించాలని, అంతర్జత పంటల సాగుపై రైతులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. 104 మడిగలతో అన్ని వసతుల కల్పన, అన్ని మున్సిపల్‌ కేంద్రాలలో సమీకృత మార్కెట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మంచిర్యాలలో వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటుతో పాటు సింగరేణి, పారిశ్రామిక కారిడార్‌ ఉన్నందున మంచిర్యాల అభివృద్ది ప్రాంతంగా చెప్పుకోవచ్చని, మరింత అభివృద్ది దిశగా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరం నడిబొడ్డున ఉన్న ప్రదేశంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి శాస్త్రీయ పద్దతిలో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ఇక్కడ అన్ని రకాల కూరగాయలతో పాటు ప్రజలకు అందుబాటులో మాంసపు విక్రయాలకు అవకాశం కల్పించడం జరుగుతుందని, మల్టీ స్టోరేజ్‌ భవనం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని, నిర్మాణ పనులను ఒక సంవత్సరంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ.టి.ఐ.) ఆవరణలో విద్యార్థుల సౌకర్యార్థం 8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ డెవపల్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు పాటు పడుతుందని, ప్రజల అభ్యున్నతి దిశగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. ఈ కేంద్రంలో విద్యార్థులు వృత్తి విద్యలో నైపుణ్యం, శిక్షణ పొంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో స్థిరపడాలని, యువత అభ్యున్నతి దిశగా ప్రభుత్వం పరిశ్రమల స్థాపన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో ఉచిత శిక్షణ అందించడంతో పాటు అనేక పథకాలతో ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post