జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రజల సౌకర్యార్థం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. గురువారం 80 లక్షల రూపాయల వ్యయంతో ఎన్. హెచ్.ఏ.ఐ., ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభించిన ఆక్సిజన్ ప్లాంట్‌తో ప్రజలకు ఎంతో మేలు కలుగనుందని, ఆక్సిజన్ కొరతపై రోగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇకపై ఆక్సిజన్ వినియోగం రోగులకు అందుబాటులో ఉంటుందని, 500 ఎల్.పి.ఎం. (లీటర్ ఫర్ మినిట్) ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ప్రతి నిత్యం జిల్లా నలుమూలల నుండి అనేక మంది వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, ఈ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ, అన్ని వసతులతో మెరుగైన వైద్యసదుపాయలు అందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకేసారి వంద పడకలకు ఈ ప్లాంట్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అవకాశం ఉందని, విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ నిరంతరంగా ఉత్పత్తి చేసేందుకు జనరేటర్‌ను అనుసంధానం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకుడు డా॥ అరవింద్, మంచిర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పెంటరాజయ్య, ఆక్సిజన్ ప్లాంట్ ఇంచార్జ్ శ్రీలత, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు, కౌన్సిలర్ సత్యనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.