ప్రజల సౌకర్యార్థం మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్

ప్రజల సౌకర్యార్థం మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్
26 మొబైల్ వ్యాక్సిన్ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్
ప్రజల సౌకర్యార్థం కోవిడ్ వ్యాక్సిన్ అందించే ఉద్దేశంతో మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని దీనిని అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఇంఛార్జి కలెక్టర్ డాక్టర్ ఎస్.హరీష్ అన్నారు.
బుధవారం కేర్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో 26 సంచార కోవిడ్ వ్యాక్సినేషన్ వాహనాలను కలెక్టర్ హరీష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ చేయాలనే ఉద్దేశంతో జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, ఐదు మండలాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కరోనా టీకాలు అందించడం జరుగుతుందని వివరించారు. దీనికోసం ప్రజలకు అందుబాటులో ఉండేలా మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలతో పాటు స్లమ్ ఏరియాలు, ఫ్యాక్టరీలు, నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కరోనా వ్యాక్సిన్లు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు కరోనా టీకాలను వేయించుకోవాలని జిల్లాలో మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాల ద్వారా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కరోనా టీకాలు వేసి వంద శాతం పూర్తయ్యేలా కృషి చేయాలని ఈ విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు, కేర్ ఇండియా ప్రతినిధి భవానిశంకర్, జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్ రెడ్డి, గిరికాంత్తో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post