ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణ రావు 108వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:9.9.2021
వనపర్తి.
కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, రట్టి హాల్లి గ్రామంలో జన్మించి, తెలంగాణలోని వరంగల్ లో నివాసం ఏర్పరచుకొని తన తెలుగు రచనలు, సాహిత్యం ద్వారా తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన గొప్ప రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజి నారాయణ రావు అని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అభివర్ణించారు.
గురువారం కలెక్టరేట్ ఆవరణలో ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణ రావు 108వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యానికి, సాహితి సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజి అని అందుకే ఆయన జన్మదినమైన ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి జరుపుకుంటున్నామని ఆమె అన్నారు.
తన కవితలు, సాహిత్యం ద్వారా లక్షల మెదళ్లను కదిలించి ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని నింపడమే గాక రాజకీయ, సాంఘీక చైతన్యం తీకువచ్చి, ప్రశ్నించడం నేర్పించిన వ్యక్తి కాళోజి అని ఆమె అన్నారు. అతి సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో సాహిత్యం రచించాడని, వారి రచనలు అందరికి స్ఫూర్తిదాయకమని అందుకే ఆయనకు ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించిందని ఆమె వివరించారు.
ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు అని, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదని నమ్మి ఆచరించిన వ్యక్తి కాళోజి అని జిల్లా కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా తెలంగాణా భాషా సాహితి సేవ దిశగా సాగిన ఆయన పయనాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాతృ భాషకు, సాహితి గౌరవాన్ని మరింతగా పెంచేందుకు సాహితీవేత్తలు కృషి చేయాలని, అలాగే ప్రజలు ఆయన ఆశలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆమె కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రచనలు స్ఫూర్తి నింపాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణు గోపాల్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) అంకిత్, సి.పి. ఓ. వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కో అప్టెడ్ సభ్యులు మునీరుద్దీన్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల సిబ్బంది, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post