ప్రజారోగ్యం పై ప్రత్యేక చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 20, 2021ఆదిలాబాదు:-

వర్షాకాల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున 42 వ వార్డులో డ్రై డే కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత వర్షాకాలంలో మూడు నెలల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా ప్రజారోగ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది వివరించిన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇండ్లలో నీటి నిల్వ వలన దోమల వ్యాప్తి చెంది మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉందని కనుక నీటి నిల్వలను ఎక్కువ రోజులు ఉంచకుండా ప్రతివారం నీటిని పారబోసి కొత్త నీటిని సమకూర్చుకోవాలని అన్నారు. మున్సిపల్, ఆరోగ్యం, మెప్మా సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలకు ఆరోగ్య విషయాలపై వివరించాలని తెలిపారు. అదేవిధంగా పరిసరాలలో, మురికి కాలువలలో నీటి నిల్వలు ఉండకుండా శుభ్రంగా ఉంచుకొనే విధంగా ప్రజలను చైతన్యపరచాలని మున్సిపల్, మెప్మా సిబ్బందికి ఆదేశించారు. వార్డులోని పలు ఇండ్లలోకి వెళ్లి ఇంటి పరిసరాలు, నీటి నిల్వలు ఉన్న తొట్టి లు, కూలర్లను పరిశీలించి దోమలు వ్యాప్తి చెందిన నీటిని పారిశుధ్య పనివారితో పారబోయించారు. మురికి కాలువలపై మట్టిని నింపి మురికి నీరు నిల్వ ఉన్నందున సంబంధిత వ్యక్తిపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల నుండి కరోనా వలన ప్రజలు అల్లాడి పోయారని, ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున ప్రజలు ఆరోగ్యం పై చర్యలు తీసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉందని, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత, వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించి, ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు కోసం కలిసి పని చేయాలనీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, వర్షాకాలం లో నీటి నిలువల వలన మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికన్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉందని అన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలని అన్నారు. చుట్టూ పక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు ఉండకుండా చూడాలని అన్నారు. అంతకు ముందు ఆ వార్డులో పని చేస్తున్న పారిశుధ్య పని వారితో కలెక్టర్ మాట్లాడుతూ, గ్లౌజులు, ప్రత్యేక యూనిఫామ్ ధరించాలని, వార్డులో పారిశుద్యం పనులు నిరంతరం నిర్వహించాలని అన్నారు. ఆ వార్డులోని విద్యార్థిని కలెక్టర్ పలకరిస్తూ డెంగ్యూ, మలేరియా గురించి తెలుసా అని అడిగారు. తనకు తెలియదని చెప్పిన విద్యార్థికి జిల్లా మలేరియా అధికారి మలేరియా, డెంగ్యూ వ్యాధి ప్రబలే వివరాలను తెలియజేశారు. వీధి బాలలు తీరుగుతున్న సందర్భంలో మెప్మా సిబ్బంది ఆ పిల్లలకు శిశు గృహాలకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డా.శ్రీధర్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, వార్డ్ కౌన్సిలర్ వెంకన్న, మెప్మా DMC సుభాష్, భాగ్యలక్ష్మి, ఆశ వర్కర్లు, మెడికల్, మున్సిపల్, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………………. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post