ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 1:

ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలిస్తూ, దరఖాస్తులను ఫార్వార్డ్ చేశారు. మధిర మండలం ఇల్లూరు గ్రామస్థులు దరఖాస్తు ద్వారా, మంజూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేసి, అర్హుల ఎంపిక చేసి, అప్పగించాలని కోరగా, కలెక్టర్ చర్యలకై తహశీల్దార్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సింగరేణి మండలం గాదెపాడుకు చెందిన రామమూర్తి, సామాజిక కార్యకర్త, గాదెపాడు నుండి గాంధీనగర్ వరకు మట్టి రోడ్డును బిటి రోడ్డుగా మార్చుటకు కోరగా, కలెక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీరుకు చర్యలకై తెలిపారు. వేంసూరు మండలం మర్లపాడుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి తనకు సర్వే నెం. 1651/అ/ఇ లో గల 22 కుంటల వ్యవసాయ భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకు కోరగా, కలెక్టర్ సంబంధిత తహసీల్దార్ కు రికార్డుల పరిశీలించి, చర్యలకై ఆదేశించారు. వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన కె. నాగేశ్వరరావు సర్వే నెం. 370/2 లోగల భూమిని అసైన్డ్ భూమిగా ఉన్న రికార్డు మార్పునకు కోరగా, సంబంధిత తహసీల్దార్ కు పరిశీలనకు కలెక్టర్ ఆదేశించారు. మధిర మండలం ఇళ్లేందులపాడు కు చెందిన రాజేంద్రప్రసాద్ సర్వే నెం. 43/ఈ/2/2 లోగల తన 2 ఎకరాల భూమికి పట్టా పుస్తకం కొరకు కోరగా, కలెక్టర్ చర్యలకై రెవిన్యూ అధికారులను ఆదేశించారు. అప్పం ఆనందరావు తాను, వైరా గ్రామ పంచాయతీలో 45 సంవత్సరాలు స్వీపర్ గా పనిచేసి, రిటైర్ అయినట్లు, తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరగా, కలెక్టర్ స్పందించి, జిల్లా పంచాయతీ అధికారి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కల్లూరు కు చెందిన షేక్ మహబూబ్ జానీ, తన ఇంటి నల్లాను గ్రామ పంచాయతీ వారు కట్ చేసినట్లు, పునరుద్ధరణకు కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. రఘునాధపాలెం గ్రామ పంచాయతీ నుండి షేక్ సాహెబ్ తమ గ్రామ పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలు గత 7 నెలల నుండి నిర్వహించుట లేదని దరఖాస్తు ద్వారా తెలుపగా, చర్యలకై జిల్లా పంచాయతీ ఆధికారిని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post