ప్రజావాణి ఫిర్యాదులకు తక్షణ పరిష్కార దిశగా చర్యలు తీసుకుందాం: జిల్లా కలెక్టర్ శ్రీ పి.వెంకట్రామ రెడ్డి

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుందామని జిల్లా కలెక్టర్ శ్రీ పి. వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం ఐడీఓసీ మీటింగ్ హల్ జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజల వినతులు, ఫిర్యాదులను ఆయన అదనపు కలెక్టర్ శ్రీ ముజమ్మీల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో చెన్నయ్యలు స్వీకరించారు.

మొత్తం 122కి పైగా దరఖాస్తులు రాగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భూ సంబంధిత సమస్యలు 74 అర్జీలు వచ్చాయి. వీటిని ఆయా డివిజన్ల పరిధిలోని ఆర్డీఓలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఇతరత్రా సమస్యల పరిష్కారం కోరుతూ 48 వరకూ ఫిర్యాదులు, వినతులు రాగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీఆర్వో అక్కడికక్కడే పరిష్కరించారు.
కాగా భూ సంబంధిత అర్జీలను వీలైనంత త్వరలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ఆయా శాఖలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. దూరప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల పట్ల మానవతా దృక్పథంతో సానుకూలంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి అన్న విషయం మరిచిపోరాదన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని, ఏదేని పరిష్కారం కాని పక్షంలో అందుకు గల కారణాన్ని అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఆయా శాఖల వద్ద పెండింగ్‌లో గల ఫిర్యాదులు, విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

– వచ్చే ప్రజావాణి నుంచి ప్రతీ అర్జీదారుడికి రశీదు

వచ్చే సోమవారం జరిగే ప్రజావాణిలో వచ్చిన ప్రతీ అర్జీదారుడికి రశీదు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి భూ సంబంధిత సమస్యలపై స్వీకరించిన అర్జీని ఆర్డీఓలు, ధరణి సూపరింటెండెంట్స్ దరఖాస్తుదారు అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీ నెంబరు ఇవ్వాలని నిర్ణయించినట్లు సూచించారు. ప్రజాశ్రేయస్సుకై ఆ సమస్యను బట్టి తక్షణమే లేదా కాలవ్యవధి నిర్ణయిస్తూ.. చర్యలు తీసుకుందామని అధికార వర్గాలకు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం అంటే ప్రజలకు నమ్మకం, విశాస్వం కలిగించేలా తక్షణ పరిష్కార దిశగా చొరవ చూపుదామని అధికార వర్గాలకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ ప్రజావాణిలో శిక్షణ కలెక్టర్ శ్రీ ప్రపుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post