ప్రజావాణి సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ప్రజావాణి సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వెలదండ మండల తహిసిల్దార్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫెరెన్సు ద్వారా కలెక్టరేట్ తో పాటు అన్ని మండలాల్లో జరుగుచున్న ప్రజావాణి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో చాలా వరకు భూసమస్యల పైనే దరఖాస్తులు వస్తున్నందున అన్ని మండలాల తహశీల్దార్లు తమ కార్యాలయ వీడియో జాన్ఫెరెన్స్ హాలు లేదా ఎన్. ఐ.సి హాలు నుండి ప్రజావాణి నిర్వహిస్తూ ఆన్లైన్ వెబ్ లో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. తద్వారా ఆయా మండలానికి సంబంధించిన ఫిర్యాదు రాగానే అక్కడే వెబ్ ద్వారా సంబంధిత తహసీల్దార్ తో మాట్లాడి ఫిర్యాదును పరిష్కరించే విధంగా సూచనలు జారీ చేసేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. మండల స్థాయి అధికారులు అందరూ ఉదయం 10.30కు ప్రజావాణికి హాజరై వీడియో కన్ఫరెన్సులో కనిపించాలని ఆలస్యంగా వచ్చే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ రోజు కొన్ని మండలాలు సరియైన ఏర్పాట్లు చేసుకొనప్పటికిని వచ్చే సోమవారం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అనంతరం మండలంలో వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. అదేవిధంగా వెలదండ మండలములోని వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. వెలదండ మండలంలో వివిధ మొడ్యూళ్లలో ఉన్న ధరణి పెండింగ్ కేసులపై ఆరాతీశారు. ధరణి కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తగసిల్దార్ ను ఆదేశించారు. ఆరోగ్య శాఖ పై సమీక్షిస్తూ మండలంలో ఇంకా దాదాపు 6 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని గ్రామాల్లో స్సర్పంచులతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. పి.హెచ్.సి లో ప్రసవాల సంఖ్యను పెంచాలని, గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలోనే ఆన్లైన్ నమోదు చేసి గర్భిణీలు తగిన వైద్య పరీక్షలు, మందులు ఇస్తూ రక్తహీనత లేకుండా చూసుకోవాలి ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పై మాట్లాడుతూ వచ్చే రెండు మూడు నెలల్లో ఏ ఒక్కరు పోషకాహార లోపం తో తక్కువ బరువు పిల్లలు ఉండటానికి వీలు లేదని ఆదేశించారు. స్యామ్ మ్యామ్ పిల్లలను గుర్తించి వారికి సరియైన పౌష్టికాహారం అందించి సాధారణ స్థితికి తీసుకురావాలని సి.డి.పి.ఓ ను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు ప్రతిరోజు స్యామ్ మ్యామ్ పిల్లల ఇళ్లకు వెళ్లి పిల్లలకు పౌష్టికాహారం అందేవిదంగా చూసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ మండల అధికారితో మాట్లాడుతూ వచ్చే యాసంగి పంటకు ఇక్కడి రైతులు వరి ధాన్యం కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మిషన్ భగీరథ కొళాయి ఉండేవిధంగా చూసుకోవాలని మండల ఆర్.డబ్ల్యూ ఎస్ అధికారిని ఆదేశించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను సమీక్షించుకోవాలాని, ప్రజలకు పనికి వచ్చే పనులను ఎంచుకుని పనులు చేపట్టాలన్నారు. తద్వారా ఉపాధి హామీ కూలీలకు గరిష్ట కూలి అందటంతో పాటు పనిదినాలు పెరిగే విధంగా చూసుకోవాలని మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు.
మండల ప్రత్యేక అధికారి పత్యానాయక్, తహసీల్దార్ కృష్ణ, సిడిపిఓ, ఏ.ఓ, ఇతర శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Share This Post