ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

@ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మహబూబ్ నగర్ నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్తు వరకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించారు.

స్వయంగా జిల్లా కలెక్టర్ ర్యాలీలో బైక్ నడుపుతూ జిల్లా పరిషత్తు చేరుకున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య ఎన్నికలను ప్రపంచ దేశాలన్నీ పరిశీలిస్తున్నాయని, ఇది ప్రతి ఒక్కరికి గర్వకారణం అని అన్నారు. ఓటరు అవగాహన, ఓటరు శాతాన్ని పెంచేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఎప్పటికప్పుడు ఎన్నికల లో అనేక సంస్కరణలను, కొత్త కొత్త విధానాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, కొత్త ఆలోచనలను స్వీప్ కార్యక్రమాల ద్వారా తీసుకొస్తున్నాయని చెప్పారు. గతంలో కేవలం 45 శాతం మాత్రమే ఉన్న ఓటింగ్ శాతం ఇప్పుడు 85 నుండి 90 వరకు పెరిగిందని చెప్పారు. గతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు సంవత్సరంలో నాలుగు సార్లు ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించిందని, అంతేకాక 18 సంవత్సరాలు నిండినవారు ఆన్లైన్ ద్వారా ఎప్పుడైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో పాటు, ఈవీఎంలు ప్రవేశ పెట్టడంతో ఈవిఎం ల ద్వారా ఓట్ల లెక్కింపు వల్ల సమయం ఆదా ఆవడమే కాకుండా, ఓట్ల లెక్కింపు ఎంతో సులభతరమైందని అన్నారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై 18 సంవత్సరాలు నిండిన వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ఎన్నికలలో అవినీతిని అరికట్టే బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని అన్నారు. అవినీతిని నివారించేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ చర్యలకు ఎప్పటికప్పుడు గండిపడుతున్నదని, అందువల్ల ప్రజలే దీనిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లు దీనిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 6 లక్షల 47 వేల 384 మంది ఓటర్లు ఉన్నారని, వీరందరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంతో పాటు ,18 సంవత్సరాల నిండి ఓటరుగా నమోదు చేసుకునెందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొనెల అవగాహన కల్పించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాక్ పవర్ మాట్లాడుతూ రాజ్యాంగపరంగా ఓటు అనేది పౌరులకు వచ్చిన ఒక హక్కు అని ,దాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తేనే మన బాధ్యతను మనం పూర్తి చేసిన వారం అవుతామని తెలిపారు. ఓటు హక్కు ఒక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.కుల మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సి ఉందని తెలిపారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్
కె. సీతారామరావు మాట్లాడుతూ ఎన్నికలలో ఓటు శాతాన్ని పెంచేందుకుగాను ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలను చేపట్టిందని, దీనివల్లనే మన దేశంలో వోటింగ్ శాతం పెరిగిందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు అవ్వడమే కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 80 సంవత్సరాలు పైబడిన, ఓటు హక్కు కలిగిన సీనియర్ సిటిజన్లను సన్మానించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని కొత్త ఓటరు గా నమోదైన కొత్త ఓటర్లకు ఫోటో ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అంతేకాక జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన ,వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్బంగా ఎన్నికల సంఘం ద్వారా పంపించబడిన “మైన్ భారత్ హున్” పాటను కార్యక్రమానికి ఆయన హాజరైన వారికి వినిపించారు.

ఆర్డీవో అనిల్ కుమార్,జెడ్ పి సి ఈ ఓ జ్యోతి, జిల్లా అధికారులు, తదితరులు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

Share This Post