ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును పండగగా నిర్వహించాలి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలి జిల్లా వ్యాప్తంగా 7,558 మంది కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డుల అందచేత జాతీయ ఓటరు దినోత్సవంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును పండగగా నిర్వహించాలి
అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలి
జిల్లా వ్యాప్తంగా 7,558 మంది కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డుల అందచేత
జాతీయ ఓటరు దినోత్సవంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును పండగగా నిర్వహించాలని ఈ విషయంలో ముఖ్యంగా యువతీ యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నుంచి జిల్లాలోని ఈఆర్వోలతో గూగుల్ మీటింగ్ ద్వారా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి యువతీ, యువకులు తప్పకుండా తమకు సంబంధించి ఓటు హక్కును నమోదు చేసుకొని దానిని ఒక పండగలా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా గూగుల్ మీటింగ్లో ఇటీవల కొత్తగా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకొన్న జిల్లాకు చెందిన 7,558 మంది కొత్త ఓటర్లయిన యువతీ యువకులకు సంబంధిత అధికారులు నూతన ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)లను పంపిణీ చేశారు. అలాగే జిల్లా కలెక్టరేట్లో నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకొన్న యువతీ యువకులకు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఎపిక్ కార్డులను అందచేశారు. అనంతరం “భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని”, ఓటరు ప్రతిజ్ఞను చేయించారు. అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు 25 జనవరి 2011 నుంచి జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని ఓటు హక్కు మనకు కల్పించిన వజ్రాయుధమని దీని ద్వారా ఓటర్లు తమకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకునేందుకు పాశుపతాస్త్రమన్నారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు యువతీ, యువకులు 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలని వారు తప్పకుండా ఓటు వేసేందుకు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు వేయడం బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకొని మంచి సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు.
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ఎస్.ఎస్.వి. ప్రసాద్ బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా ఎన్నికల సిబ్బంది. జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post