ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరే కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.

మంగళవారం నాడు 12 వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు.
తొలుత జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు పాత్ర కీలకమని,  అలాంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సుస్థిరమైన ప్రజాస్వామ్యానికి దోహదపడాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని, ముఖ్యంగా యువత ఓటు యొక్క ప్రాధాన్యత గుర్తించాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని అన్నారు.
జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,  ఓటు యొక్క ప్రాధాన్యత అందరికీ తెలియాలనే  ఉద్దేశంతో 2011 సంవత్సరం నుండి జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకుంటున్నామని,  యువ ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువ ఉండాలనేదే దీని ఉద్దేశమని,  యువత తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామి కావాలని అన్నారు.  పట్టణాలలో కంటే గ్రామాలలో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని,  గ్రామాలలో వృద్ధులు కూడా ఉత్సాహంతో ఓటింగ్ లో పాల్గొంటారని,  పట్టణాలలో యువత కూడా ఓటింగ్ లో తప్పక పాల్గొనాలని,  ఓటు విలువ అందరూ తప్పక తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని,  ప్రతి సంవత్సరం జనవరి 1నాటికి ఓటరు జాబితా సవరణ ద్వారా ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని, 18  సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా  తమ పేరును నమోదు చేయించుకోవాలని, ఈ సంవత్సరం 3307 మంది నూతనంగా ఓటు హక్కు పొందారని తెలిపారు.
భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, జిల్లా టీజీఓ అధ్యక్షులు ఎం.ఉపేందర్ రెడ్డి, భువనగిరి తాసిల్దార్ వెంకటరెడ్డి,  సీనియర్ సిటిజన్ ఓటర్లు బాలకృష్ణారెడ్డి, బి.యన్.రెడ్డి, నరసింహారావు, తదితరులు ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటరు బాధ్యతల గురించి వివరించారు.
తదుపరి ఓటరు బాధ్యతలు, ఓటు హక్కు విశిష్టతను తెలియజేసే ప్రతిజ్ఞ నిర్వహించారు.
అనంతరం సీనియర్ సిటిజన్ ఓటర్లను జిల్లా కలెక్టర్ సన్మానించారు. 18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న యువతీ యువకులకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్ అందజేశారు.
కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి విజయ కుమారి,  కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం.నాగేశ్వర చారి, జిల్లా ఎన్నికల కార్యాలయ సూపరింటెండెంట్ నాగలక్ష్మి,  అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరే కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.

Share This Post